25-05-2025 08:26:56 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాల(Saraswati Pushkaralu)లో భాగంగా ఆదివారం 11వ రోజు శ్రీశ్రీశ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ(Sri Yogananda Saraswati Swamiji) మొదటి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం స్వామీజీ సరస్వతి మాతను దర్శించుకొని శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంకు రాగ ఆలయ అర్చకులు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ద్వీలింగాలకు శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. శుభానంద దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. సరస్వతి పుష్కరాల్లో సినీ నటుడు తనికెళ్ల భరణి(Film actor Tanikella Bharani) పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు చేశారు.
సరస్వతి పుష్కరాలు రేపటితో ముగియనున్న సందర్భంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఆదివారం అన్ని శాఖల అధికారులతో పుష్కరాలు ముగియనున్న చివరిరోజు సోమవారం ఏర్పాట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాకి టాకీ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 26వ తేదీ సోమవారం పుష్కరాలు చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో స్నానఘట్టాలు, రహదారులు, పార్కింగ్ స్థలాలు, ఇతర సదుపాయాల వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
గత 11 రోజులుగా పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబసభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించి, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించిందని, చివరిరోజు అలెర్ట్ గా ఉండాలని తెలిపారు. భద్రత, పారిశుధ్య, ఆరోగ్య సేవల కల్పన కోసం అవసరమైన వసతులన్నీ కల్పించబడినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. చివరి రోజైన రేపు భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు కొనసాగించాలని ఆయన సూచించారు. భక్తులు జిల్లా యంత్రాంగం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు.