జర్నలిస్టుల నిరసన విజయవంతం
కలెక్టర్లకు టీడబ్ల్యూజేఎఫ్ వినతిపత్రాలు
వందలాదిగా తరలివచ్చిన పాత్రికేయులు
15న ‘చలో సమాచార్ భవన్’
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): జర్నలిస్టుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి పాత్రికేయులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ నిరసన గళాన్ని వినిపించారు.
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డ్స్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటితో పాటు ఆర్టీసీ బస్సు పాసులను పూర్తిగా ఉచితం చేయాలని, మెట్రో రైల్ పాసులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద జర్నలిస్టులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నెల 15న హైదరాబాద్‌లోని సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం (సమాచార్ భవన్) ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నట్లు నాయకులు ప్రకటించారు.
ఈ ‘చలో సమాచార్ భవన్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాత్రికేయ లోకానికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమం హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, ములుగు, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, జగిత్యాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీస్థాయిలో జరిగింది. హైదరాబాద్ జిల్లాలో ఫెడరేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్, రంగారెడ్డి జిల్లాలో ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య నిరసనలకు నాయకత్వం వహించారు.
వరంగల్‌లో ఉపాధ్యక్షులు ఈ. చంద్రశేఖర్, బి. దయాసాగర్, జగిత్యాలలో గుడిగ రఘు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సలీమా, హైదరాబాద్‌లో హెచ్ యూజే అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్, బి. జగదీష్, ఆఫీసు బేరర్లు గండ్ర నవీన్, బి. దామోదర్, బి. రాజశేఖర్, మోతె రమేష్, మహబూబ్ నగర్‌లో తాటికొండ కృష్ణ, సంగారెడ్డిలో వై. ప్రభాకర్, నిజామాబాద్‌లో కుంచె వెంకటేశ్ తదితర ఆఫీసు బేరర్లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు నగదు రహిత హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. మహిళా జర్నలిస్టులు సైతం ఈ నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






