calender_icon.png 24 May, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే..

08-05-2025 05:14:24 PM

గులాబీ జెండా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంది..

మేము నిర్మిస్తే మీరు కులకొడుతున్నారు..

శిలాఫలకాలు ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజలలో బీఆర్ఎస్ పాత్రను చెడపలేరు..

పదహారు నెలలలో పదహారు అభివృద్ధి పనులు చేయలేదు..

మాజీ ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..

మునుగోడు (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ప్రాంత అభివృద్ధి సంక్షేమ పథకాలలో అనేక ఇబ్బందులలో పడ్డారని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(BRS Party constituency incharge Kusukuntla Prabhakar Reddy) అన్నారు. గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఆయన పర్యటించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి మాట్లాడారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మునుగోడు మండల కేంద్రానికి నాలుగు కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి ఎస్సీ కాలనీలో మురికి కాలువలను నిర్మించామన్నారు.

ఉప ఎన్నికలలో గెలిచిన తర్వాత  570 కోట్లు నిధులను మంజూరు చేయించి గ్రామాలలో లింకు రోడ్లకు టెండర్లు పిలిపించి పనులు మొదలు పెడితే వాటిని చేయనీయకుండా అడ్డుపడ్డారు. నా హయాంలో ప్రారంభించిన క్యాంపు కార్యాలయాన్ని తొలగించడం నిరంకుశత్వం, మునుగోడు క్యాంపు కార్యాలయాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించాను. ఇప్పుడు ఆ కార్యాలయంపై నా పేరు ఉన్న శిలాఫలకాన్ని తీసేసి, తన పేరుతో కొత్తదాన్ని పెట్టారు. ఇది సార్వత్రిక ప్రమాణాలకు వ్యతిరేకంగా, పూర్తిగా నిరంకుశంగా చేసిన పని," అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గుర్తుగా వేసిన శిలాఫలకాలను గ్రామాల్లో తొలగిస్తున్నారు.

ఇది రాజకీయ కక్షసాధింపు తప్ప మరేమీ కాదు. ఈ చర్యలు ప్రజలే చూసి తీర్పు చెబుతారు," అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీరును చూస్తుంటే ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా ఎలాంటి నిబద్ధతా లేదు. ఇప్పటికైనా వీళ్ల తీరు మార్చుకోకపోతే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తరపున కచ్చితంగా బదులు ఇస్తాం అన్నారు. రైతులు వడ్లు అమ్మేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రాలు సరిగా పనిచేయడం లేదు. ప్రభుత్వం మాత్రం కళ్ళు మూసుకొని కూర్చుంది. రైతులను ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం సిగ్గు చేటు అన్నారు. మునుగోడులో రోడ్డు విస్తరణ పేరుతో ఇరువైపులా ఇళ్లను కూల్చేశారు. కానీ తర్వాత రోడ్డు పనులు నిలిపివేశారు. ఇది అభివృద్ధి కాదు ప్రజల జీవితాల మీద గిమ్మత్తు చేయడం అని అన్నారు.

ప్రభుత్వ పథకాలు కేవలం పేరుకు మాత్రమే. ప్రజలకు అసలు ఆ పథకాలు అందడం లేదు. ప్రచారాలతో మాయ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు," అని విమర్శించారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇది ఒక నిరంకుశ పాలనకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు ఉండటం సహజం. వాటిని అణచివేయడం అనేది ప్రజా హక్కుల ఉల్లంఘన అన్నారు. పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకుండా, చట్టాన్ని పాటించే స్థిరస్థాయి వ్యవస్థగా ఉండాలి. వాళ్లు అధికార పార్టీకి కాకుండా ప్రజలకు విధేయులుగా పనిచేయాలి. రాజగోపాల్ రెడ్డి అధికారాన్ని కమిషన్ల కోసమే ఉపయోగిస్తున్నారు. అభివృద్ధి కోసం కాదే, తమ స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు. ఇది ప్రజలకు మోసం చేయడమే," అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

నిధులు మంజూరు చేయించిన నేటికీ ఆ పనులు చేయకుండా మూడు మీటర్లను ఆరు మీటర్లు చేస్తామని చెప్పి పనులను జరగనివ్వడం లేదని అన్నారు. ఈ ప్రాంతం సాగునీరు తాగునీరు అందించేందుకు కేసిఆర్ తో కొట్లాడి ప్రాజెక్టులను నిర్మిస్తే ఆ పనుల్లో జోక్యం చేసుకున్నారు. అభివృద్ధిని ఆపి శిలాఫలకాలను ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో గులాబీ జెండాను చరపలేరని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం నాడు చేసిన అభివృద్ధి నేడు పల్లెల్లో కనిపిస్తుంది. 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్టు, రైతుబంధు ఒంటి సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయి. సొంత నిధులతో అభివృద్ధి పనులు చేయిస్తున్నానని చెప్పి అవి మరల ప్రపోజర్లు పెట్టి బిల్లులు మంజూరు చేయించుకున్నాడు.

బ్రాహ్మణ వెల్లంల నుండి పులిపలుపుల చెరువులోకి వచ్చిన నీరుతో ఏమీ ఉపయోగం పడలేదని ఆయన మాత్రం పాలాభిషేకం చేయించుకున్నాడని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ధ్వంసం చేసిన శిలాఫలకాలను మరల పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని మీరు నేర్పిన బుద్ధులతో మీరు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతం అభివృద్ధి, సంక్షేమం కోసం అధికారం ఉన్న లేకున్నా రాజీ లేకుండా పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మందుల సత్యం, ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్, మాజీ ఎంపీటీసీ పొలగోని సైదులు, ఈద శరత్ బాబు, అయితగోని విజయ గౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి, మాధగోని అంజయ్య గౌడ్, ఎడవల్లి సురేష్, వనం లింగయ్య పందుల సురేష్, దోటి కర్ణాకర్, సూర శంకర్, పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.