20 August, 2026 | 1:55 AM

రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం

20-08-2026 01:04 AM
  1. గ్రామీణ ప్రాంతాలకు ఆధునాతన రోడ్లు
  2. రాష్ట్ర అభివృద్ధికి రహదారులే కీలకం
  3. రూ.150 కోట్లతో పెద్దపల్లి బైపాస్ నిర్మాణం
  4. మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, తుమ్మల
  5. సుల్తానాబాద్, మంథనిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పెద్దపల్లి/సుల్తానాబాద్/మంథని, ఆగస్టు 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గ్రామీణ ప్రాంతాలకు ఆధునాతన రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

బుధవారం సుల్తానాబాద్ పట్టణంలో రూ.47 కోట్లతో సుల్తానాబాద్ నుంచి పెద్దాపూర్ వరకు రహదారి నిర్మాణ పనులను, మంథనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో వారు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రహదారులు ఎంతో కీలకమని, రాష్ట్రవ్యాప్తంగా రూ.36 వేల కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.

పెద్దపల్లి పట్టణానికి రూ.150 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. మంథని నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రూ.800 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని తెలిపారు. గోదావరి నదిపై హై లెవల్ బ్రిడ్జికి రూ.125 కోట్లు, బైపాస్ రహదారికి రూ.162 కోట్లు, హెచ్‌ఏఎం రహదారులకు రూ.203 కోట్లు, మంథనిఓడేడు రహదారికి రూ.60 కోట్లు తదితర పనులకు నిధులు కేటాయించినట్లు చెప్పారు.

అన్ని రహదారి పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని, ప్రతి 15 రోజులకు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. కమాన్‌పూర్ నుంచి మంథని మున్సిపాలిటీ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సుమారు రూ.200కోట్లు మంజూ రు చేసేందుకు సీఎం ఆమోదం తీసుకుంటామని, 15 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. గంగాపురిలో నిర్మిస్తున్న ఎన్‌ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. 

తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్రంలో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తూ తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పెద్దపల్లికి బైపాస్ రోడ్డు నిర్మించలేదని విమర్శించారు. సుల్తానాబాద్‌కు కూడా అతి త్వరలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. మంథని ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

గోదావరి హైలెవల్ బ్రిడ్జి, రహదారి విస్తరణ పనులకు  భూసేకరణను పూర్తిచేసి పనులను వేగవంతం చేస్తామన్నారు. సూపర్ ఎల్నినో  నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. మంథనికి పరిశ్రమలను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కోకాకోలా వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. 

రైతులు, మహిళలకు అండగా ప్రభుత్వం: మంత్రి తుమ్మల 

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మంథని ప్రజలు కష్టకాలంలోనూ కాంగ్రెస్‌కు అండగా నిలిచారని తెలిపారు. నియోజకవర్గానికి రూ.800 కోట్ల నిధులు మంజూరు కూడా తక్కువేనన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రైతులు, మహిళలు, చేనేత కార్మికులకు అండగా నిలుస్తోందన్నారు.

ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఎంపీ వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్లు రాధాకృష్ణ, మల్లయ్య, వైస్‌చైర్మన్ అంతటి పుష్పలత, మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్‌చైర్మన్ సహేందర్రెడ్డి, రామగుండం మేయర్ స్వామి, డిప్యూటీ మేయర్ పారుపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు.