23 August, 2026 | 2:47 AM

విద్యార్థులకు న్యాయం చేయాలి

23-08-2026 12:00 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన శక్తి స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచం లో యువతీ యువకులకు ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో అల్లాడుతున్నారు. అందుకే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలనే కోరిక ఉన్నప్పటికీ, తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వృతి విద్యా కోర్సుల్లో చేరుతున్నారు.

పాలిటెక్నిక్ చదవడం వల్ల చిన్నతనంలోనే ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలలో ఉద్యోగాలు లభిస్తాయి. తద్వారా త్వరగా స్థిరపడి కుటుంబానికి అండగా నిలబడవచ్చన్నది పాలిటెక్నిక్ విద్యార్థుల ఆశయం. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఫీజు రాయితీ ఇవ్వకుండా నిరుపేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తూ గత విద్యా సంవత్సరం 2024-2025 నుంచి పాలిటెక్నిక్ కోర్సులో 140 శాతం ఫీజులు పెంచింది.

అంతేకాకుండా ఇటీవల శక్తి స్కీమ్ పేరిట విద్యావ్యవస్థలో ఆకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు. శక్తి స్కీమ్ వల్ల నష్టపోతామని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడాల్సిందిపోయి ఇంజినీరింగ్ విద్య అనర్థమని స్వయంగా ముఖ్యమంత్రి పేర్కొనడం వల్లనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్రను మరువరాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శక్తి స్కీమ్‌ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలి.

 మిద్దె సురేష్, నాగర్ కర్నూల్ జిల్లా