సన్మార్గంలో నడపడం నేరమా?
ఇది కేవలం ఒక వ్యక్తి ఆవేదన కాదు, సమకాలీన విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ప్రశ్న. ఒక గురువు తన విద్యార్థిని చూసి చదువు అని చెప్పడం, మార్కులు తగ్గితే ఎందుకు తగ్గాయి? అని ప్రశ్నించడం, తప్పు చేస్తే మందలించడం, క్రమశిక్షణ పాటించమని చెప్పడం కూడా నేరంగా, ప్రాణసంకటంగా మారిపోతున్న ఈ కాలంలో... అసలు తరగతి గదిలో గురువు పాత్ర ఏమిటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో జరిగిన విషాద ఘటనను కేవలం ఒక నేరంగా చూడలేం. ఆ దుర్ఘటనను సాధారణ ఘటనగా చూసి వదిలేస్తే, భవిష్యత్తు తరాలకు మనం ఒక దిశానిర్దేశం లేని చీకటి సమాజాన్ని బహుమతిగా ఇచ్చినట్టే అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
పతనం దిశగా విద్యావ్యవస్థ
కొండమల్లేపల్లి ఘటనను ఒక సాధార ణ హత్య కేసుగా పరిగణించి, నిందితుల అరెస్టుతో కథ ముగిసిపోయిందని భావించడం మన అజ్ఞానమే అవుతుంది. సాధారణంగా ఏదైనా నేరం జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ, ఈ ఘటన విద్యావ్యవస్థకు సంబంధించినది. అందుకే ఈ ఘటన మన విద్యాసమాజం ముందు ఒక బరువైన ప్రశ్నను నిలబెట్టింది. ఒక విద్యార్థిని సరిదిద్దే ప్రయత్నంలో ఒక ఉపాధ్యాయుడు తన ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి రావడం విద్యావ్యవస్థకే సిగ్గుచేటు అని చెప్పవచ్చు.
చెడు మార్గంలో ప్రయాణిస్తున్న ఒక విద్యార్థిని సన్మార్గంలోకి నడిపించడం కూడా తప్పేనా? తప్పులు చేస్తున్న పిల్లలను ‘ఇది తప్పు. అలా చేయకూడదు’ అని చెప్పడం కూడా నేరమేనా? ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక విద్యార్థిని సరిదిద్దే క్రమంలో ఒక గురువు మనసులో ‘నా ప్రాణాన్ని ఎందుకు ప్రమాదంలో పడేసుకోవాలి? ఆ విద్యార్థి ఏమైపోతే నాకేంటి? అనే ప్రశ్న పుడితే ఈ సమాజం ఏమైపోతుంది. అలాంటి ఆలోచన గురువు మెదళ్లలో మెదిలిన రోజున, ఆ గురువు తన బాధ్యతల కంటే తన భద్రత గురించి మాత్రమే ఆలోచించడం ప్రారంభిస్తాడు. అక్కడే మన విద్యావ్యవస్థ పతనం మొదలవుతుంది.
మందలింపులో ఉన్న బాధ్యత
తప్పు లేదా పొరపాటు చేసిన విద్యార్థులను ఉపాధ్యాయుడు మందలించడం సహజం. ఒకప్పుడు బడిలో మాస్టారు మందలించాడంటే, ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా భయపడేవాడు. ఒకవేళ చెప్పినా, తల్లిదండ్రులు ముందుగా అడిగేది ‘మాస్టారు నిన్నెందుకు మందలించాడు? నువ్వేం తప్పు చేశావు?’ అని. నాడు గురువు మందలింపులో ఉన్న బాధ్యతను, ప్రేమను విద్యార్థుల కుటుంబాలు కూడా గుర్తించాయి. మనమంతా అలాంటి మంచి వాతావరణంలో చదువుకున్న వాళ్లమే.
మార్పు మంచిదే కానీ..
నేడు కాలం మారింది. బాలల హక్కులు, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత గౌరవం, శారీరక శిక్షల దుష్పరిణామాలపై సమాజంలో అవగాహన పెరిగింది. ఇది కచ్చితంగా స్వాగతించదగిన పరిణామమే. కానీ, ఒక మంచి మార్పు మరో ప్రమాదకరమైన ధోరణికి అస్సలు దారితీయకూడదు. శారీరక లేదా మానసిక హింసను వ్యతిరేకించ డం వేరు, పిల్లవాడిని సరైన దారిలో పెట్టే ప్రతి క్రమశిక్షణ చర్యను వేధింపుగా భావించడం వేరు. ఈ రెండింటి మధ్య స్పష్టమై న వ్యత్యాసం ఉంటుంది. పిల్లలను శారీరకంగా హింసించడం, క్రమశిక్షణలో పెట్టేందుకు తీసుకునే చర్య మధ్య ఉండే సన్నని గీతను నాటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు గుర్తించారు.
గురువు ఒక విద్యార్థిని శారీకరంగానో, మానసికంగానో హింసించి భయపెట్టకూడదు. తోటి విద్యార్థుల ముందు అవమానించకూడదు. శారీరకంగా హింసించకూడదు. కానీ, అదే సమయంలో... హోంవర్క్ ఎందుకు చేయలేదు? ఎందుకు తరగతికి ఆలస్యంగా వస్తున్నావు? చెడు స్నేహాలు ఎందుకు చేస్తున్నావు? అని అడిగే హక్కు, ఆ బాధ్యత, హక్కు గురువుకు కచ్చితంగా ఉంటుంది. ఆ కనీస నైతిక బాధ్యత లేదా హక్కు లేకపోతే, విద్య అనేది కేవలం వ్యాపారంగా, ఉపాధ్యాయుడు కేవలం ఒక సిలబస్ డెలివరీ మెషీన్‌గానే ఈ సమాజంలో మిగిలిపోతాడు.
గురువులకు భద్రత కరువైనప్పుడు తరగతి గదిలో ఒక విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన మార్పు మొదలవుతుంది. మాస్టారు అద్భుతంగా పాఠం చెబుతాడు. కానీ, విద్యార్థి వ్యక్తిగత ప్రవర్తన గురించి మాట్లాడడు. ప్రిన్సిపాల్ మార్కుల పట్టిక చూసి ఊరుకుంటాడు. కానీ, ఎందుకు తగ్గాయి? అని ఆ విద్యార్థిని అస్సలు నిలదీయడు. విద్యార్థి దారి తప్పుతున్నాడని తెలిసినా మనకెందుకు వచ్చిన గొడవ? అని ఇటు ఉపాధ్యాయులు, అటు ప్రిన్సిపాల్ చూసీచూడనట్లు వెళ్లిపోతారు. ఎందుకంటే ఉపాధ్యాయులకు కూడా కుటుంబా లు ఉన్నాయి. సాయంత్రం క్షేమంగా ఇంటికి చేరుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ ‘నాకెందుకులే’ అనే నిర్లిప్తత సమాజానికి క్యాన్సర్ లాంటిది.
తల్లిదండ్రుల ప్రేమకూ హద్దుండాలి
పిల్లలు తప్పు చేసినప్పుడు ‘నా పిల్లవాడిని ఎవరూ ఏమీ అనకూడదు’ అని తల్లిదండ్రులు గుడ్డిగా వెనకేసుకురావడం అత్యంత ప్రమాదకరం. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమకు కూడా హద్దులు ఉండాలి. పిల్లవాడి తప్పును కప్పిపుచ్చడం భవిష్యత్తులో వాడికే తీరని నష్టం చేస్తుంది. తప్పును తప్పని చెప్పడం, క్రమశిక్షణ నేర్పడం పెంపకంలో భాగమే. చిన్న వయసులోనే బాధ్యత, నిజాయితీ, ఇతరుల పట్ల గౌరవం నేర్పించకపోతే పెద్దయ్యాక చట్టం, సమాజం ఆ పిల్లవాడికి కఠినమైన పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు మీడియా పాత్ర కూడా అత్యంత కీలకం. సమాజాన్ని ప్రభావితం చేసే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాస్తవాల కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఏకపక్షంగా కథనాలు ప్రసారం చేసి ఉపాధ్యాయ వ్యవస్థను దోషిగా నిలబెట్టడం సబబు కాదు. గోరంతను కొండంత చేసి చూపడం కాదు, సమస్య మూలాలను సమాజం ముందుంచడం మీడియా బాధ్యత.
ఒక ప్రైవేటు పాఠశాల వెనుక ఫీజుల లెక్కలు మాత్రమే ఉండవు. యాజమాన్యా లు విద్యార్థుల భద్రతతో పాటు ఉపాధ్యాయుల భద్రతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాలలో ఏదైనా వివాదాలు తలెత్తినప్పుడు కౌన్సెలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండాలి. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమన్వయం ద్వారా సమస్యను పరిష్కరించుకునే స్పష్టమైన వ్యవస్థ పాఠశాలల్లో ఉండాలి.
మార్గనిర్దేశం చేసే గురువు
అదే సమయంలో, ఆధునిక ఉపాధ్యాయులు కూడా తమ పద్ధతులను మార్చుకోవాలి. మందలింపు అంటే అరుపు కాదు, క్రమశిక్షణ అంటే భయపెట్టడం కాదు. విద్యార్థి సమస్యను సావధానంగా వినాలి. విద్యార్థి చేసిన తప్పును అతనికి స్పష్టంగా ఓపికతో వివరించాలి. తద్వారా విద్యార్థులను సరైన మార్గాన్ని చూపడమే ఆధునిక గురువు లక్షణం. మనకు ఇప్పుడు కావాల్సింది మందలించే మాస్టారు కాదు, విద్యార్థులను మార్గనిర్దేశం చేసే గురువు.
భవిష్యత్తు బాగుండాలంటే..
తరగతి గదిలో గురువు పాత్ర పాఠాలు చెప్పడానికి మాత్రమే పరిమితమైతే సమాజానికి తీవ్ర నష్టం జరుగుతుంది. రేపటి తరగతి గదిలో గురువు ఒకటే చెబితే.. ‘చదవాలనుకుంటే చదువు. లేకపోతే నీ ఇష్టం’ అని చేతులెత్తేస్తే, అది గురువు ఓటమి కాదు. అది తల్లిదండ్రుల ఓటమి కాదు. అది మొత్తం సమాజం ఓడిపోయిన రోజు అవుతుంది. భయం లేని గురువు, బాధ్యత గల తల్లిదండ్రులు, క్రమశిక్షణతో కూడిన విద్యార్థి, బాధ్యతాయుతమైన మీడియా, విలువలను కాపాడే సమాజం.. ఈ ఐదు మూలస్తంభాలు బలంగా ఉన్నప్పుడే మన భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయి.
వ్యాసకర్త: జర్నలిస్ట్, సైకాలజిస్ట్






