07-08-2025 12:00:00 AM
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం
కామారెడ్డి, ఆగస్టు 06, (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిలో రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ అన్నారు. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను, జిల్లా అధికార యంత్రంగాన్ని ఆయన అభినందించారు. బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం బస్సాపూర్ గ్రామంను హౌసింగ్ అధికారులతో, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి బిక్నూరు మండలకేంద్రంలో ఫిల్టర్ రూప్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను, దోమకొండ మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సందర్భంగా ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపు అంశాలపై లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉచితంగా ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని, దశలవారీగా నిర్మాణం జరిగిన కొద్దీ బిల్లులు వెంటనే లబ్ధిదారులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిక్నూర్ మండల కేంద్రంలో ఫిల్టర్ రూప్ పద్ధతిలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ హౌసును పరిశీలించారు.మామూలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కంటే ఈ పద్ధతిలో నిర్మించుకోవడం చాలా బాగుంది అన్నారు.ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఎక్కువ లబ్ధిదారుల పైన ఆర్థిక భారం పడకుండా ఉంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా12,090 లక్ష్యంతో 11,883 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా వాటిలో 5,721 ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించడం జరిగిందన్నారు.
ఇప్పటివరకు 2,182 ఇండ్లు బేస్మెంట్ లెవల్ వరకు, 66 ఇండ్లు రూప్ లెవల్ వరకు నిర్మాణం పూర్తికాగా 1 ఇల్లు నిర్మాణం పూర్తయిందన్నారు. 2,111 ఇండ్లకు నిర్మాణ దశను బట్టి బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. 431 మంది నిరుపేద లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం ప్రారంభించుకునేందుకు ఐకెపి మహిళా సంఘాల ద్వారా లింకేజీ రుణం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ విక్టర్, లోకల్ బాడీస్ చందర్ నాయక్, పిడి హౌసింగ్ విజయ్ పాల్ రెడ్డి, కామారెడ్డి ఆర్డీవో వీణ, హౌసింగ్ డిఇ సుభాష్, ఏఈలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.