07-08-2025 12:00:00 AM
-తెలంగాణ జాగృతా.. భారత జాగృతినా?
-ఎటూ తేల్చుకోలేని స్థితిలో కవిత
నిజామాబాద్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): ఒకప్పుడు అంతా ఆమె చెప్పినట్టుగా నడిచేది. ఆమె అన్నది వేదం ఆమె చెప్పిందే శిలాశాసనం ఆమె కను సైగలతోనే జిల్లా పార్టీ క్యాడర్ జాగృతి కార్యకర్తలు అప్రమత్తమయ్యేవారు. కాకలు తీరిన ఎమ్మెల్యేలు సైతం వివిధ పనుల నిమిత్తం వారి వద్దకు వెళ్లిన వారికి అక్కను అడగండి అనేవారు కానీ నేటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కవిత నిజామాబాద్‌కు తరచూ వచ్చి పోయేది. ఐదు నెలలకు పైగా కవిత నిజామా బాద్ కు రాకపోవడం గమనించదగ్గ విషయం.
ఆమె వచ్చింది అంటే మంది మార్బలం చోట బడా నాయకులంతా దగ్గరుండి మరీ స్వాగతం పలికేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. భారత రాష్ట్ర సమితి కవిత మధ్యలో నెలకొన్న ప్రతి ప్రతిస్తంభన ఈ పద్యంలో ఆమె క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కూతురైన కవిత అనుచరులు ఎటు తేల్చు కోలేని సందిగ్ధంలో ఉన్నారు. ఇటు కవితతో ఉండాలా అటు గులాబీ పార్టీలో ఉండాలని ఆలోచనలో పడ్డారు.
ఇటీవల బీసీ రిజర్వేషన్ విషయమై జాగృతి తరఫున కవిత చేపట్టిన దీక్ష కార్యక్రమానికి ప్రముఖ నాయకులు గాని రెండవ శ్రేణి నాయకులు గానీ ఎవరు నిజామాబాద్ జిల్లా నుండి మద్దతు పలకలేదు. కవిత వెంట ఉన్న చిన్నచితక అనుచరులు మాత్రం జాగృతి దీక్ష విజయవంతం చేయాలని విలేకరుల సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా గులాబీ శ్రేణుల్లో అణుచిత పరిస్థితి నెలకొంది. జిల్లాలో కవిత పట్ల నెలకొన్న ఈ పరిణామాల విషయమై ఎవరు ఏమి మాట్లాడ లేకపోతున్నారు. మొదటి నుండి పార్టీలో పని చేస్తున్న పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు ఉద్యమకారులు గందరగోళ స్థితిలో ఉన్నారు. మరోవైపు జిల్లాలో కవిత ద్వారా పదవులు పొందిన వారు కవిత అనుచరులుగా కొనసాగుతున్న నాయకులు కార్యకర్తలు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత నివాసం పూర్తిగా వెలవెలబోతోంది. గతంలో జాగృతి పేరిట పలు స్వచ్ఛంద కార్యక్రమాలు పట్టిన కవిత లిక్కర్ కుంభకోణం అనంతరం జాగృతి కమిటీలు అన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత భారత జాగృతి తెరపైకి తెచ్చింది కార్యకలాపాలు సైతం జాతీయస్థాయిలో మొదలు పెట్టాలని కల్పించింది. తిరిగి ఇటీవల బీసీ రిజర్వేషన్ల దీక్ష కవిత చేపడుతున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన కొందరు జాగృతి మాజీ కార్యకర్తలు అంతా మేమంతా జాగృతి సభ్యులమంటూ కవిత చేపడుతూ దీక్షకు మద్దతు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున బీసీలంతా హాజరు కావాలంటూ విలేకరుల సమావేశంలో పత్రికా ముఖంగా ప్రజలను కోరారు. కవిత నిర్ణయం భవిష్యత్తు ప్రణాళికలపై ప్రతి ఒక్కరు జిల్లాలో ఆసక్తిగా గమనిస్తున్నారు.
కవిత చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తేల్చుకోలేని స్థితికి చేరిపోయారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న జాగృతి కార్యకర్తలు అమీ తుమి తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. జాగృతి విషయమై బహిరంగంగా మాట్లాడేందుకు ఉద్యమకారులు గాని కార్యకర్తలు గాని ఎవరు ముందుకు రావడం లేదు. పార్టీకి వ్యతిరేకంగా కార్యకర్తలు ఎవరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోయినప్పటికిని ఉద్యమ కారులను గుర్తించి వారికి సరైన పదవులు కట్టబెట్టి న్యాయం చేయాలని కవిత కోరడం బిఆర్‌ఎస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది.
వివిధ పదవులు కవిత ద్వారా పొందిన వారు నామినేటెడ్ పోస్టులను దక్కించుకున్న వారు సైతం గులాబీ పార్టీని వదిలి కవితతో కలిసి రావడానికి వెనుకంజ వేస్తున్నారు. వీరంతా ఎమ్మెల్సీ కవితకు ఎప్పటికీ మద్దతు గా ఉంటామని చెప్తున్నప్పటికీ ఇటీవల కవిత చేపట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఉద్యమానికి ఎవరు కూడా మద్దతు ఇచ్చి హాజరు కాలేదు. జాగృతిలో పనిచేసిన కవులు కళాకారులు కవిత పట్ల వ్యక్తిగతంగా అభిమానం కలవారు మాత్రం జాగృతి చేపట్టిన దీక్ష కు మద్దతు ఇస్తున్నారు.
గత ఏడాది కవిత రద్దు చేసిన జాగృతి కమిటీల స్థానంలో కొత్త కమిటీలు వేస్తే తమకు సముచిత స్థానం జాగృతిలో కల్పిస్తుంది అన్న ఆశాభావంతో కొత్త కమిటీ కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. జాగృతి కాకుండా కవిత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే పూర్తి మద్దతుతో బి ఆర్ ఎస్ లో నుండి బయటకు వచ్చి కవితకు బహి రంగంగా మద్దతు ప్రకటించడానికి మరికొందరు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.