పదిలో కందనూల్ జిల్లా రెండో స్థానం
ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
నాగర్కర్నూల్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పదో తరగతి వార్షిక ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 202526 విద్యాసంవత్సరానికి విడుదలైన ఫలితాల్లో జిల్లాలో 10,641 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 10,538 మంది ఉత్తీర్ణులై 99.03 శాతం ఉత్తీర్ణత సాదించడంతో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
గతేడాది 96.83 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈసారి దాదాపు 3 శాతం పెరిగింది. గతంలో 13వ స్థానంలో ఉన్న జిల్లా ఈసారి రెండో స్థానానికి చేరుకోవడంతో కందనూల్ జిల్లా ప్రజలు గర్విస్తున్నారు.బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. బాలురలో 5,258 మంది పరీక్షలకు హాజరై 5,192 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల్లో 5,383 మంది పరీక్షలు రాయగా 5,346 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 99.31గా నమోదైంది.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతిభ కనబరిచారు.
టీచర్లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని జిల్లా విద్యాశాఖ అధికారులు రమేష్ కుమార్ తెలిపారు. జిల్లా విద్యార్థులు సాధించిన ఫలితాలపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అభినందనలు తెలిపారు.గత సంవత్సరాల ఫలితాలు:202223 : 10,545 9,582 90.87% 12వ స్థానం నమోదు కాగా 202324 10,507 9,621 91.57% 23వ స్థానానికి పతనమైంది.202425లో 10,530 మంది విద్యార్థులకు గానూ 10,196 96.83% 13వ స్థానానికి పెరగగా 202526 లో మాత్రం 10,641 10,538 99.03% 2వ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. వేలకు వేలు ఫీజులు దండుకునే ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలు ప్రభుత్వ పాఠశాల, గురుకుల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఫలితాలు సాధించారు.






