30 April, 2026 | 2:13 AM

ప్రభుత్వ పాఠశాల ప్రభంజనం

30-04-2026 01:02 AM

ఎస్‌ఎస్సి ఫలితాల్లో 560 మార్కులతో  మండల టాపర్గా అంజలి

వెంకటాపూర్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రతిభకు ఏమాత్రం కొదవ లేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా విడుదలైన ఎస్‌ఎస్సి ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన జరుపుల అంజలి 560 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచి విశేష ప్రతిభ కనబర్చింది. మండల కేంద్రానికి చెందిన జరుపుల రమేష్ సుజాత దంపతుల కుమార్తె అయిన అంజలి, చిన్నప్పటి నుంచే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తోంది. చదువులో క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగిన ఆమె అన్ని విషయాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ ఉపాధ్యాయుల ప్రశంసలు పొందింది. పాఠశాల స్థాయి పరీక్షల నుంచే తన ప్రతిభను చాటుకున్న అంజలి, ఎస్‌ఎస్సి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి మండల స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఆమె సాధించిన విజయంతో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఇదే పాఠశాల నుంచి మెట్టు జయశ్రీ (556), రాయనవేన శ్రీజ (553) మార్కులు సాధించి వరుసగా రెండో, మూడో స్థానాలు పొందారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో 15 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు సాధించగా, 100 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. నాణ్యమైన బోధన, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల కలిసొస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా అగ్రస్థానాల్లో నిలవగలవని ఈ ఫలితాలు స్పష్టంగా చాటిచెప్పాయి. ఇలాంటి ఫలితాలు సాధించడంలో సహకరించిన ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, డీఎన్‌ఆర్ ట్రస్ట్, ఆర్డీటీ ట్రస్ట్ ప్రతినిధులు, విద్యాశాఖాధికారులు, ఎంపీడీవో, తహసీల్దార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక, సీనియర్ ఉపాధ్యాయుడు బాబురావు తమ కృతజ్ఞతలు తెలిపారు.