18 July, 2026 | 3:17 AM

కన్నడ నటి శోభిత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగింత...!

02-12-2024 07:51 PM

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): బుల్లితెర కన్నడ నటి శోభిత(32) ఆత్మహత్య కేసుపై దర్యాప్తును గచ్చిబౌలి పోలీసులు ముమ్మరం చేశారు. ఆదివారం మధ్యాహ్నం శోభిత తన బెడ్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా ఆమె మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త సుధీర్ రెడ్డితో పాటు చుట్టు ప్రక్కల వారితో వీరి వైవాహిక జీవితం గురించి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.

అయితే శోభిత డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలతో చనిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులు కర్ణాటక నుండి వచ్చి ఆమె మృతిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మ్యాట్రిమోనిలో శోభిత ప్రొఫైల్ చూసి సుధీర్ రెడ్డి ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుధీర్ రెడ్డిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత శోభిత నటనకు దూరంగా ఉంటుందన్నారు. ఈ మేరకు శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే నటి శోభిత ఆత్మహత్యకు ముందు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడిందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.