calender_icon.png 29 June, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నప్ప కల్పితం కాదు.. మన చరిత్ర

27-06-2025 12:03:25 AM

విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ క్రమంలో గురువారం కథానాయకుడు విష్ణు మంచు మూవీ టీమ్‌తో కలిసి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. “కన్నప్ప’కు ఇప్పటివరకు లక్షకుపైగా టికెట్లు తెగాయి.

ఇంతటి రెస్పాన్స్ చూసి నాకు ఆనందమేస్తోం ది. ఇదంతా శివలీల అనిపిస్తుంది. ‘కన్నప్ప’ మీద ఇంత పాజిటివిటీ వస్తుందని ప్రారంభంలో ఎవ్వరూ నమ్మలేదు. అది వారి తప్పు కాదు.  నా చిత్రం పది వారాల వరకు ఓటీటీలో రాదు. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడాలని కోరుకుంటున్నా.. పిల్లలే ఎక్కువగా చూడాలని అనుకుంటున్నా. అందుకే కుటుంబాలకు భారం కావొద్దని టికెట్ రేట్లు ఎక్కువగా పెంచడంలేదు. ఏపీలో కొన్నిచోట్ల మాత్రమే పెంచాం. నా నలుగురు పిల్లలూ ఈ చిత్రంలో నటించారు.

ఓ తండ్రిగా నా పిల్ల ల్ని తెరపై చూడటం ఆనందంగా ఉంటుంది. నా పిల్లలు ఆర్టిస్టులు అవ్వాలని కోరుకుంటున్నా. కానీ వాళ్లు ఏం అవుతారో చూద్దాం. నేను ఏ కమ్యూనిటీని కించపర్చాలనుకోను. ఈ చిత్రంలో ఎవరినీ అగౌరవపర్చలేదు. దేవుడిపై భక్తి ఉంటే చాలు అని చెప్పాలనుకున్నాం. దేవుడికీ.. భక్తుడికి మధ్యలో ఎవ్వరూ ఉండాల్సిన పనిలేదు, మూఢత్వాన్ని వీడాలని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది. ‘కన్నప్ప’ కథ కల్పితం కాదు. మన మధ్య జీవించినవాడు.

ఇది చరిత్ర” అని చెప్పారు. ముఖేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించాం. ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని ఎదురుచూస్తున్నాం. పూర్తి నిర్మలమైన మనసుతో సినిమా చూడండి. మీరిచ్చే తీర్పుని గౌరవిస్తా” అన్నారు. కెమెరామెన్ షెల్డన్ చౌ మాట్లాడుతూ.. “కన్నప్ప’ అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా చివరి గంట గొప్పగా ఉంటుంది. క్లుమైక్స్ కంటతడి పెట్టిస్తుంది” అని తెలిపారు.

శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి సినిమాలు చేయడం, నిర్మించడం అంత ఈజీ కాదు. ఒట్టేసి చెబుతున్నా సినిమా అద్భుతంగా ఉంటుంది’ అన్నారు. నటుడు కౌశల్ మాట్లాడుతూ.. “తెలుగువాళ్లకు దాదాపు 50 ఏళ్ల తర్వాత కన్నప్ప చిత్రాన్ని మళ్లీ ఈ తరానికి తగ్గట్టు విష్ణు అందిస్తున్నారు” అన్నారు. 

ఆత్రుతగా ఎదురుచూస్తున్నా: మంచు మనోజ్ 

‘కన్నప్ప’ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు మంచు మనోజ్ పేర్కొన్నారు. ఆ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. “కన్నప్ప’ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కోసం నాన్న, ఆయన టీమ్ ఎన్నో ఏళ్లు ఎంతో శ్రమను, ప్రేమను పెట్టింది. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా.

ఇది బ్లాక్‌బస్టర్ హిట్ కావాలని ప్రార్థిస్తున్నా. మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను బిగ్‌స్క్రీన్‌పై చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా” అని రాసుకొచ్చారు. అయితే, మనోజ్ పోస్ట్‌లో ఎక్కడ కూడా తన సోదరుడు, ‘కన్నప్ప’ కథానాయకుడు మంచు విష్ణు పేరును ప్రస్తావించకపోవటం గమనార్హం. కొన్నిరోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసినవే. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఈ మూవీటీమ్‌కు విషెస్ తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది.