12-08-2025 12:36:49 AM
కరీంనగర్, ఆగస్ట్11(విజయక్రాంతి):పకడ్బందీ ప్రణాళికతో కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఒక మాడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన సుడా వాణిజ్య భవన సముదాయ నిర్మాణం, ఐడిఎస్‌ఎంటి షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు,
ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. దాదాపు 4.79 కోట్లతో మౌలిక వసతుల కల్పన.. ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. నాలుగు కోట్లతో సుడా వాణిజ్య భవన నిర్మాణాన్ని చేపడుతు న్నామని తెలిపారు. ప్రస్తుతం రెండు కోట్లు మంజూరు అయ్యాయనీ, వాటితో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఐడిఎస్‌ఎంటి షాపింగ్ కాంప్లెక్స్ పనులు 79 లక్షలతో చేపడుతున్నామని తెలిపారు.
అభివృద్ధి పనులకు సంబంధించిన పనులు నాణ్యతతో చేపట్టేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సూచించారు. పనులు వేగవంతంగా చేపట్టి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నగరంలో మిగిలిపోయిన పనులకు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామనీ, ఆ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూస్తామన్నారు.
అదేవిధంగా కరీంనగర్ కు తలమానికంగా నిలిచే మానేర్ రివర్ ఫ్రంట్ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ శాతవాహన యునివర్సిటీ లో తాము ఏర్పాటు చేసిన గ్రూపులతోనే యూనివర్సిటీ రన్ అయిందనీ, తమ ప్రభుత్వం వచ్చాక శాతవాహన యూనివర్శిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో,ఆర్ డి ఓ మహేశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, మృత్యుంజయం, జిల్లాఅధికారులు, మాజీ కార్పొరేటర్లు తదితరులుపాల్గొన్నారు.