17 April, 2026 | 9:18 PM

ఉద్యోగుల హక్కుల కోసం గర్జించిన కరీంనగర్ జేఏసీ

17-04-2026 07:45 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో భోజన విరామ సమయంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్ మెడికల్ బిల్లులు, ఇన్సూరెన్స్ బిల్లులు, జిపిఎఫ్ వంటి రాజ్యాంగబద్ధ హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పీఆర్సీ ఇప్పటికీ అమలు కాకపోవడం, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నదని తెలిపారు. అనంతరం జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కు వినతి పత్రం సమర్పించగా,  ప్రభుత్వానికి పంపిస్తామని ఆమె హామీ ఇచ్చారని తెలిపారు.