27-10-2025 06:24:05 PM
- భారీగా పోటెత్తిన భక్తులు
- కార్తీక దీపాలు వెలిగించేందుకు పోటీ పడ్డ మహిళలు
బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం ఉత్సవాలను దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. అర్చకులు సతీష్ శర్మ వేదమంత్రోచ్ఛారణల మద్య రాజరాజేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి మొదటి సోమవారం భక్తులు బుగ్గకు పోటెత్తారు.
భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ అధికారులు నీడ కల్పించేందుకు షామియానాలు ఏర్పాటు చేశారు. శుభ్రమైన నీటితో కోనేరును స్నానాలకు సిద్ధం చేశారు. నాగులమ్మ గుడి తో పాటు భక్తాంజనేయ దేవాలయాన్ని ప్రత్యేక పూజలకు సిద్ధం చేశారు. బెల్లంపల్లికి చెందిన శ్రీవాసవి భజన బృందం, సహాయక సంఘం సభ్యులు ప్రత్యేక భజనలు నిర్వహించారు. గర్భగుడిలో రాతి శివలింగానికి ప్రత్యేక ఆరాధన చేసి అర్చకులు సతీష్ శర్మ సమక్షంలో అన్నదాత మిడిల్ రాజశేఖర్, మాధురి దంపతులు(మందమర్రి) అన్న పూజ నిర్వహించారు. పూజల్లో తాండూర్ మాజీ ఎంపీపీ, బుగ్గ దేవాలయ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, ఎండోమెంట్ ఆఫీసర్ జి. బాపిరెడ్డి, బుగ్గ రాజేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.