25 May, 2026 | 1:05 AM

‘కవిసేన’ స్వాప్నికుడు శేషేంద్ర

25-05-2026 12:00 AM

గుంటూరు శేషేంద్ర శర్మ.. ఈ పేరు తెలుగు సాహితీ రంగంలో పరిచయం అవసరం లేని నామధేయం. కవిత్వం లో నూతనత్వం పరిచయం చేసిన శేషేంద్ర ప్రయాణమంతా ఒక ఎత్తు అయితే ‘కవి సేన మేనిఫెస్టో’ ద్వారా సాహిత్యంపై ఆయన వ్యక్తీకరించిన విమర్శ మరో ఎత్తు. ఉద్యమ కవిగా సాహిత్య ఉద్యమాలకు ఒకే ఒక ఒంటరి ప్రతినిధి శేషేంద్ర. 1977లో రాసిన ఈ రచన అసలు కవిత్వం అంటే ఏమిటి? ఎలా రాయాలి? ఎందుకు రాయాలి? ఎవరికోసం రాయాలి? ఇలాంటి తాత్విక అంశాలపై ఆధునిక సాహిత్య చరిత్రలో తెలుగులో ప్రామాణిక గ్రంథం. పుస్తకం సుమారు 57కి పైగా విమర్శకుల గ్రంథాలను రంగరించి వెలువరించిన ఆధునిక కావ్య శాస్త్రం.

అప్పట్లో సాహిత్యంలో అన్ని వర్గాలను, అన్ని సంఘాలను తీవ్రమైన ఆందోళనకు మనస్తా పానికి గురిచేసిన రచన ఇది. దేశానికి నాయకత్వం వహించాల్సిన కవి రాజకీయ భవనాల్లో పెంపుడు కుక్కగా బతక డాన్ని నిరసిస్తూ తనకున్న ఆయుధాలను గమనించి, వాటికున్న చైతన్యాన్ని గుర్తించి సరిగ్గా ప్రయోగించి వైజ్ఞానిక నాయకత్వాన్ని దేశానికి ప్రసాదించాల్సిన బాధ్యత కవికి ఉందని చెప్పే మేనిఫెస్టో ఇది. ‘నడిచే ఈ కవి సేన సముద్రాన్ని సృష్టించే వరకూ నిద్రపోదని నాకు గట్టిగా తెలుసు.. ఒక్కో వాక్య శకలాన్ని ఒక్కో పిస్టల్‌లా పట్టుకుని నడుస్తున్నారు నా తమ్ముళ్లు ఈ యువసేనలో..’ అంటూ అవధా నిని ఒక పాత్రను చేసి చెప్పించారు.

ప్రజల్లో కవిత్వానికి పరపతి పోయే దశ వచ్చిందని ఈ దేశంలో కవిస్థానం పునః ప్రతిష్ఠితం కావాలని శేషేంద్ర కలలు కన్నారు. ‘ఏ దేశంలోనైనా కవే నాయకత్వం వహిస్తాడు ఈ దేశంలో మాత్రం రాజకీయవాది నాయకత్వం వహిస్తే, కవి వాడి అడుగుజాడల్లో కుక్కలా నడుస్తాడు. ఈ తరం కుళ్లిపోయింది దీన్ని బాగుపరచలేం.. కానీ ధ్వంసం చేయొచ్చు’ అని తన బాధతప్త హృదయాన్ని వ్యక్తీకరించారు. కవిత్వం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో సుదీర్ఘంగా చర్చిస్తూ సాగిన బృహత్ రచన ఇది. 

కవిసేనకు కొన్ని ఆశయాలు

శేషేంద్ర ‘కవిసేన’కు కొన్ని ఆశయాలు నియమాలు ఉన్నాయి. మనిషి కన్నీరు కార్చే, ఆయుధాలు చేసే జంతు వు అంటుంది కవిసేన. జీవితం చేతిలో ఓడిపోకుండా, జీవితం కంటే బలవంతుడు కావాలి మనిషి. మానసిక యుగానికి స్వస్తి చెప్పి క్రియా యుగానికి స్వాగతం పలకాలి, అట్లాగే కవిత్వమే కవి ఆయుధం కావాలి. కవే దేశానికి అసలు నాయకుడని, రాజకీయవాది నాయకత్వాన్ని కవిసేన ధిక్కరిస్తుంది.

ఇది కవుల పార్టీ అని, కవిత్వానికి ఒక ప్రమాణం నిర్ణయించాలని, ఆర్థిక సామాజిక సమస్యల వరకు ఈ శతాబ్దం అంగీకరించిన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని కనీస పరిష్కారంగా స్వీకరించాలి. కవి బాధ్యత రాజకీయ బాధ్యత కంటే గురుతరమైనదని, కవి - కుల, మత, కాల, భాషా, దేశాలనే పంచ విధ బంధాలను అధిగమించాలి. కవిత్వం క్రియాపరంగా అన్వయం కావాలని, కథకుడు, నవలాకారుడు, విమర్శకుడు, నాటక రచయిత కూడా కవిగానే పరిగణింపబడతాడు కవి సేనలో. ఇది రాజకీయ ఉద్యమం కాదని వైజ్ఞానిక ఉద్యమం అని, కవికి రాజకీయాలతో సంబంధం ఉంటుంది కానీ, రాజకీయ పార్టీలతో కాదని స్పష్టం చేశారు.

దేశంలో నాలుగు మూలలా ముక్కలు ముక్కలుగా పడి ఉన్న వైజ్ఞానిక వర్గాన్ని సంఘటితం చేయడానికి ఉద్యమించడమే కవి సేన ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. ‘రసః- తత్ కించిత్ కవి కర్మ మర్మ -నపు నర్వాగ్డిండిమా డంబరః’ (కవి కార్యము రసమేగాని శబ్దాల పేలుడు కాదు) శబ్దమే కవిత్వం కానప్పుడు శబ్దం యొక్క శబ్దం కవిత్వం ఎట్లా అవుతుందని ప్రశ్నిస్తారు శేషేంద్ర. ఇం కొక చోట వ సపోత కవితా దౌర్భాగ్యాన్ని గురించి లెనిన్ మాటలను ఉటంకిస్తూ ‘అవి వసపోత కవిత మీద గొడ్డలి పెట్టు మాత్రమే కాదు, రాజకీయ ముఠాకవుల మీద లెనిన్ ఎత్తిన మారణాస్త్రం’ అని పేర్కొన్నారు. 

కవిత్వం లేకపోతే అంధకారమే

ఏ కవిత్వం లేకపోతే లోకం అంధకార బంధురం అయిపోతుందని భయపడతారు శేషేంద్ర. కవిత్వంలో కమిట్మెం ట్ గురించి మాట్లాడుతూ- కవి ఎవడు? జ్వలించేవాడు. జ్వలించి బహిర్జగత్తులో ఆత్ముక్యం పొందేవాడు. ఇంతటి తధాత్మ్యం సాధించినప్పుడే కవిత్వం ఉత్పన్నమవుతుంది. కవి ఉత్తమ ప్రయోజనం కోసం ఉత్తమ అనుభూతి ఆర్జించాలి. ఆ ఉత్తమ అనుభూతి సత్వగుణైక సాధ్యం. దాని ప్రభావం చేతనే లోకపు శోకంతో కవి ఏకం అయ్యే దశ చేరగలడు. అంటే శోకించే దశ చేరగలడు. కనుక కవికి శోకం ప్రధానం అంటారు. కవి శోకంలో క్రోధం ఉండాలి అలానే మనిషికి ఆశాజ్యోతి ఇవ్వాలి కవి. కవిని విధి మీద తిరుగుబాటు చేయమంటారు.

విధిని వధించి గీతను ఛేదించు, అధర్మ రూపక వర్తమాన సామాజిక వ్యవస్థని విధ్వంసం చేయ్. ఇదే ఈనాటి బోధ. కవి శోకంలో నుంచే కార్యం పుట్టింది సమాజంలో కవే ప్రజా గాయకుడు. కవే మత వాఙ్మయ కర్త అని కూడా అంటారు. ప్రజల మీద కవి ప్రభావం గురించి చెబుతూ సమాజంలో కవి మాత్రమే జ్ఞాని. కనుక ఎప్పుడూ కవిలో నుంచే జ్ఞానం ప్రజల్లోకి ప్రవహిస్తుంది. ఇక్కడ జ్ఞానం అంటే చైతన్యం. ఇది మానవ చరిత్రలో ఉండే శాశ్వత సత్యం. మార్క్సిస్టు దృక్పథం ప్రకారం.. కవిత గాని మరే ఇతర సృజనాత్మక రచన గాని ఆత్మకళ. ఈ కళ మార్క్సిస్టు దక్పథం ప్రకారం (ఈ మేనిఫెస్టో ప్రకారం కూడా) ఏకముఖ ఆత్మీకరణ మార్గం మాత్రమే కాదు, జగత్తును తన ప్రకారం అవగాహన చేసుకోవడం లేదా శిల్పించడం మాత్రమే కాక, తాను జగత్తుగా శిల్పించుకోవడం కూడా ఉంది. ఈ కళాభ్యాసంలో అదే ఆత్మ జగత్తుల ఐక్యం అని ఈ మేనిఫెస్టో వివరించింది. 

వ్యాసకర్త: జడ్పీ పాఠశాల ఉపాధ్యాయురాలు, 

దర్భరేవు గ్రామం, ప.గో జిల్లా, ఏపీ

కవిత్వం ఒక ఆత్మకళ

కవిత్వం ఒక ఆత్మకళ. అనుభూతి వలక ఆత్మకళాభ్యాసాల సన్నివేశాల నుండే కవితా వాక్య శకలాలు దొరుకుతాయి , జీవిత సన్నివేశాల నుంచి పోగేసుకున్న వాక్యాలే నిజమైన కవితలు అవుతాయి, ఇదే శేషేంద్ర పద్ధతి. కవికి కావాల్సింది ఇంద్రియవాదం. హేతువాదం కాదు. ఆత్మ కళాభ్యాసానికి ఇంద్రియాలు గురువులు. ఆత్మకళాభ్యాసం అనుభూతిని కళగా అభ్యసించడం చేతనే సాధ్యమవుతుంది. ఆత్మీకరణ ప్రక్రియను, ఆత్మ కళాభ్యాస ఆవశ్యకతను, ప్రాచ్య, పాశ్చాత్య తత్వవేత్తలు ఏకగ్రీవంగా అంగీకరించారు.

ఆత్మకళా సిద్ధి దశ గురించి వివరిస్తూ ఈ దశలో కవి ఒక అసాధారణ విశిష్ట స్థితిలో ఉంటారని చెబుతారు. కవి మొదట అనుభూతిని కళ గా అభ్యసించాలి. ఆత్మీకరణని కళగా అభ్యసించాలి. తర్వాత అభివ్యక్తిని కళగా అభ్యాసం చేయాలి. ఈ అవిచ్చిన్న అభ్యాస తంత్రంలో పడి జీవితమంతా ఒక తపస్సయ్యి కావ్యతంత్రంగా మారిపోతుంది. అందుకే ముందు కవిత్వం ఒక జీవన విధానమేగాని కేవలం శబ్ద రచనా వ్యాపారం కాదనే బ్రహ్మాండమైన సత్యా న్ని కవిసేన నొక్కి వక్కాణిస్తుంది. పద్యం గురించి చెబుతూ బాబూ - పద్యం ఒక దేవాలయం- అందులోకి ప్రవేశించాలంటే శబ్దాలూ, భావాలూ చివరకు దేవుడు కూడా శుభ్రంగా స్నానం చేసి, మడి కట్టుకుని ప్రవేశించాలి అంటారు శేషేంద్ర.

తోట రంగమణి