22-05-2025 12:00:00 AM
కాంగ్రెస్ అభివృద్ధి పథకాలతోనే మార్పు మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, మే 21 : ముఖ్యమంత్రిగా కేసీఆర్ దత్తత తీసుకున్న చిన్నములుకనూరు గ్రామంతో సహా, పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన ఇండ్ల నిర్మాణ హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రాగానే పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, కోహెడలో జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
“పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో 1240 ఇండ్లు మంజూరు చేస్తే, 443 ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు అందించారు. ఇందులో ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న చిన్నములుకనూరులో 240 ఇండ్లు కూడా పూర్తి కాలేదు. మేము మొదటి దశలోనే 3500 ఇండ్లను పేదలందరికీ ఇస్తున్నమన్నారు.
కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తే, తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందన్నారు. సిద్దిపేట జిల్లాలోనే 45 వేల మందికి కొత్త రేషన్ యూనిట్లు పెరిగాయని, అరులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు.
గౌరవెల్లి’ పూర్తి..
గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. “కాలువలను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అక్కన్నపేట మండలానికి మండల పరిషత్ కార్యాలయం వచ్చిం దని, కస్తూర్బా పాఠశాల భూ పంచాయతీ పరిష్కారం అయ్యిందని, శాతవాహన యూ నివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీని హుస్నాబాద్‌కు తీసుకొచ్చినట్టు తెలిపారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి పార్టీ కార్యకర్తలకు సూచించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, సన్న వడ్లకు రూ. 500 బోనస్, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వంటి పథకాలను ఇంటింటికీ వివరించాలన్నారు.
ఇప్పటికే 60 వేలకు పైగా ఉద్యోగా లు భర్తీ చేశామని, మహబూబ్‌నగర్ జిల్లా లో రూ. 12,600 కోట్లతో ఇందిరా సౌర గృహ వికాసం పథకాన్ని ప్రారంభించినట్టు, రూ.2 లక్షలలోపు రైతు రుణమాఫీ పూర్తి చేసినట్టు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తు న్నామని, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని పునర్వ్యవస్థీకరించాలని మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.