calender_icon.png 22 May, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాలపై ప్రజల ఆశలు!

22-05-2025 12:00:00 AM

  1. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం వేలల్లో దరఖాస్తులు 
  2. ఇప్పటికే మొదలైన లబ్ధిదారుల  ఎంపిక ప్రక్రియ 
  3. సబ్సిడీ రుణాల కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు 
  4. ప్రభుత్వం, బ్యాంకుల షరతులతో లబ్ధిదారుల్లో అయోమయం 
  5. వివిధ రకాల కారణాలతో నెలల తరబడి కాలయాపన 

సంగారెడ్డి, మే 21 (విజయక్రాంతి) : రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల పథకాల కోసం ఆశావహులు పెద్దసంఖ్యలో ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంతోపాటు ప్రత్యేకంగా రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల పథకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే లబ్దిదారుల ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఎంపిక ప్రక్రియ పేరుతో నెలల తరబడి కాలయాపన చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సకాలంలో దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అరులైన పేదలకు పథకాలను వర్తింపజేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. 

బ్యాంకులు అంగీకరిస్తేనే...

రాజీవ్ యువవికాసం కింద నిరుద్యోగ యువతకు జీవనోపాధి కోసం సబ్సిడీతో కూడిన రుణాన్ని ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో రూ.50 వేల యూనిట్‌ను పూర్తి సబ్సిడీతో ఇవ్వనుండగా.. రూ.4 లక్షల వరకు రుణాలను కేటగిరీ బట్టి 70 శాతం వరకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించసున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో అందిన దరఖాస్తుల పరిశీలన, వడబోత ప్రక్రియ కొనసాగుతోంది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారులతో పాటు సంబంధిత బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ పథకం కింద లబ్దిదారుల ఎంపిక పూర్తిగా బ్యాంకుల గ్యారంటీ పైనే ఆధారపడినట్టు కనిపిస్తోంది. లబ్దిదారునికి యూనిట్ మంజూరుపై బ్యాంకు అధికారులు అంగీకరిస్తేనే సబ్సిడీ రుణం అందనుంది. 

దక్కేది కొందరికే.. 

ఉమ్మడి జిల్లాలో రాజీవ్ యువ వికాసం కింద వేల సంఖ్యలో దరఖాస్తులు రాగా.. ప్రభుత్వం మాత్రం లబ్దిదారుల ఎంపిక విషయంలో అధికారులకు పరిమితమైన లక్ష్యాలను నిర్దేశించింది. జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖా స్తులు వస్తే ప్రభుత్వం మాత్రం తక్కువ మందికే రుణాలు మంజూరు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

యూనిట్ల ఎంపిక, దరఖాస్తుదారుల సామర్థ్యం. యూనిట్ ఏర్పాటు చేయగల అవకాశాలు, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకున్నాకే బ్యాంకులు మంజూరుకు ఆమోదం తెలపనున్నాయి, మండల స్థాయిలో లబ్దిదారుల ఎంపిక పూర్తయ్యాక, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీ లబ్దిదారుల జాబితాను ఫైనల్ చేయనుంది. 

విడతల వారీగా ఇళ్లు.. 

నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఒక్కో జిల్లాలో ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొదటి దఫాలో ఇల్లు లేని వారు, గుడిసె, రేకుల ఇంట్లో నివసిస్తున్న వారికి అవకాశం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక చేపడుతున్నారు. రెండో కేటగిరీలో పక్కా ఇల్లు లేని వారు, సాంత జాగా లేని పేదలకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

గ్రామాలు, మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికను ఎంపీడీఓలు పూర్తిచేస్తారు. ఆ తర్వాత కలెక్టర్ లబ్దిదారుల ఎంపికను పరిశీలిస్తారు. ఆనంతరం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పర్యవేక్షణలో తుది జాబితా రూపుదిద్దుకోనుంది. ఇందుకు మరిన్ని రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. 

పరిశీలన కొనసాగుతోంది

రాజీవ్ యువ వికాసం కింద వచ్చిన మొత్తం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో 23వేల వరకు, మెదక్ జిల్లాలో 20వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ అధికారులతో పాటు బ్యాంకు అధికారులు సమగ్రంగా దరఖాస్తుల పరిశీలన చేపడుతున్నారు. బ్యాంకుల పరిశీలన పూర్తయిన తర్వాత ఆమోదం పొందిన వాటిని జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తారు. తర్వాత లబ్దిదారుల జాబితా విడుదల చేస్తాం.

 జగదీష్, బీసీ సంక్షేమ శాఖాధికారి, సంగారెడ్డి