ఎమ్మెల్యేలకు కేసీఆర్ వీడ్కోలు పార్టీలు
మాజీ సీఎంది మొసలి కన్నీరు
గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు?
ప్రభుత్వ విప్ ఆది శ్రీనినాస్
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో బంతి భోజనాలు ఏర్పాటు చేస్తూ విడ్కోలు పార్టీలు ఇస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్ గేట్లు ఎందుకు తెరుచుకోలేదో చెప్పాలని నిలదీశారు. రేవంత్‌రెడ్డి తుఫాన్‌లో బీఆర్‌ఎస్ కొట్టుకుపోతుందని, ఆ పార్టీలో మిగిలేదని నలుగురేనని తెలిపారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్‌తో కలిసి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ మొసలి కన్నీరు కార్చుతున్నారని మండిపడ్డారు.
టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రిగా చేసినప్పుడు కేసీఆర్‌ను కేటీఆర్ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. 2019లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎటు పోయిందో కేటీఆర్ చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందన్నారు. బీఆర్‌ఎస్ మునిగిపోతున్న నావ అని, ఆ నావలో ఎవరు ఉండరని జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కేసీఆర్ హీనాతిహీనంగా చూశారని, రేవంత్‌రెడ్డి మాత్రం ప్రజాప్రతినిధులకు గౌరవం ఇస్తున్నారని వివరించారు.
పోచారం శ్రీనివాస్‌రెడ్డి మీద ఉన్న గౌరవంతోనే రేవంత్‌రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారని శ్రీనివాస్ తెలిపారు. కేసీఆర్ విందు భోజనాల పేరుతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్ ఆరోపించారు. ఎమ్మెల్యేలపై కపట ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేటీఆర్‌కు రాజ్యాంగం, అన్యాయం, అక్రమం అన్న మాటలు గుర్తుకు రాలేదా? అని ఆయన నిలదీశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వివాదం పార్టీ అంతర్గతమని, జీవన్‌రెడ్డి అంటే సీఎంకు ఎంతో గౌరవం ఉందన్నారు.






