28 July, 2026 | 3:42 AM

కొందరు పార్టీ మారినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు : కేసీఆర్

25-06-2024 05:29 PM

హైదరాబాద్ : బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పార్టీని వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను పలువురు బీఆర్ఎస్ నేతలతో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై ఎంఎల్ఎలు కేసీఆర్ తో చర్చించారు.

మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవద్దని నేతలకు కేసీఆర్ సూచించారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చే నష్టమేమీ లేదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా.. భయపడలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని నేతలతో కేసీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, భవిష్యత్ లో బిఆర్ఎస్ కు మంచి రోజులు వస్తాయని తెలిపారు.  ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు, నేతలతో తరచూ కలుస్తానన్ని హామీ ఇచ్చారు. ఇప్పటి ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఎంఎల్ఎ దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎంఎల్ఎ గూడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీని వీడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.