కాంగ్రెస్ నేతల్లో జోష్ లేదు: కేసీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత జోష్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల్లో లేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ శనివారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలపై కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిపై కాంగ్రెస్ తక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు. సరూర్ నగర్ కాంగ్రెస్ సభకు కనీసం 3 వేలమంది కూడా రాలేదన్నారు.
రాష్ట్రం దివాళా తీసిందని ఏ సిఎం చెప్పరు.. రాష్ట్రం దివాళా తీసిందనడం వల్ల రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ అవుతూందని సూచించారు. ఆర్థికపరిస్థితిపై కాంగ్రెస్ చెప్పినవన్నీ తప్పుడు లెక్కలే అన్నారు కెసిఆర్. కాంగ్రెస్ చేసిన తప్పలే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాటేస్తోందని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో కరెంట్ కోతలు వర్ణనాతీతం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్ కోతలు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ హయంలో హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ చేశానని కెసిఆర్ చెప్పారు. న్యూయార్క్,లండన్ విద్యుత్ పోయినా హైదరాబాద్ లో పోదు అనే పరిస్థితి ఉండేదని ఆయన పేర్కొన్నారు.






