కాంగ్రెస్ చాలా పెద్ద తప్పులు చేసింది : కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు పరిశ్రమలు తరలివచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశ్రమలు తరలిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలపై తెలంగాణ భవన్‌లో కేసీఆర్ శనివారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలువబోతుందని జోస్యం చెప్పారు. రెండు ప్రభుత్వాల తప్పుడు విధానాలను ప్రజలకు వివరించామని తెలిపారు. కాంగ్రెస్ చాలా పెద్ద తప్పులు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేశారని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టి అక్కసు వెళ్లగక్కారన్నారు.
కాంగ్రెస్ వైఫల్యమే ఆ పార్టీని నాశనం చేస్తోందన్నారు. కాంగ్రెస్ చేసిన నేరాలు క్షమార్హమైనవి కాదని తెలిపారు. వ్యవసాయం కోసం వేల కోట్లు ఖర్చు చేశామన్న కెసిఆర్ రైతులకు కాంగ్రెస్ పార్టీ పెట్టుబడి సాయం ఇవ్వలేదని ఆరోపించారు. ఆరోగ్రశ్రీ, రీఎంబర్స్ మెంట్ పథకాలను తాను కొనసాగించానని గుర్తుచేశారు. బేషజాలకు పోయి బీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలను కాంగ్రెస్ నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా జరగడం లేదని కేసీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఏ ఊరు పోతే అక్కడి దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారు. డిసెంబర్ 9 పోయి.. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తాం అంటున్నారు... ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటున్నారు.. ఏ సంవత్సరమో చెప్పలేదని ఎద్దేవా చేశారు. కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయి... చందానగర్ లో సబ్ స్టేషన్ పై దాడి చేసే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రం నుంచి కంపెనీలు భయపడి పారిపోతున్నాయని చెప్పారు.
రైతులకు పంటనష్టం కింద కాంగ్రెస్ చెప్పిన బోనస్ సాయం.. బోగస్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ దుష్పరిపాలన ఆ పార్టీకి శాపంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం... ప్రజాభివృద్ధికి కాంగ్రెస్ ఇవ్వడం లేదని కెసిఆర్ పైర్ అయ్యారు. దళితబంధకు బిఆర్ఎస్ విడుదల చేసిన నిధులను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. టైగర్ ను చర్లపల్లి జైళ్లో వేస్తాం అంటున్నారు.. నన్ను జైళ్లో ఎందుకేస్తారు.. నేను చేసిన తప్పేంటి? అని ప్రశ్నించారు. బిజెపి అజెండాలో పేదల, దళితుల గురించే ఉండదన్నారు. మా రాష్ట్ర వాటా తేల్చకుండా నదుల అనుసంధానానికి ఒప్పుకునేది లేదని చెప్పానన్న విషయం గుర్తుచేశారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు కూడా తాను ఒక్కుకోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు.






