10 April, 2026 | 3:00 PM

Breaking News

అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •  

లక్ష్యం వైపు అడుగులు ఆగవు!

10-04-2026 01:18 PM

ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వైపు మోతీకుమార్ ప్రయాణం

పెనుబల్లి,(విజయక్రాంతి): పేదరికం అడ్డుగా నిలిచినా… కలలు మాత్రం ఆగవు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర గ్రామానికి చెందిన బర్మావత్ మోతీకుమార్ అదే విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలనే గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ గిరిజన యువకుడు… ఇప్పటివరకు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అతని కలకు పెద్ద సవాలుగా మారాయి. సుమారు ₹44 లక్షలు అవసరమైన ఈ యాత్రకు ఇప్పటికీ దాతలు పెద్దగా ముందుకు రాలేదు.

అయితే… సహాయం రాకపోయినా, తన ప్రయత్నం ఆగకూడదని నిర్ణయించుకున్న మోతీకుమార్, ఈ నెల 18వ తేదీన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇది అతని ధైర్యం, పట్టుదలకు నిదర్శనం. ఇప్పటికే మోతీకుమార్ సాధించిన విజయాలు అతని సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో (5835 మీటర్లు), రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ (5642 మీటర్లు) పర్వతాలను విజయవంతంగా అధిరోహించి తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు.

పేద కుటుంబంలో జన్మించిన మోతీకుమార్ చిన్నప్పటి నుంచి కష్టాల మధ్య పెరిగినా, తన లక్ష్యంపై నమ్మకాన్ని కోల్పోలేదు. పశువులు కాస్తూ గుట్టలు ఎక్కిన ఆ బాలుడు… ఇప్పుడు ప్రపంచ శిఖరాన్ని అందుకోవాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండా ఎగురవేయాలనే అతని కల, ప్రతి యువకుడికి స్ఫూర్తి. కానీ ఆ కలను నిజం చేయడానికి సమాజం నుండి, దాతల నుండి సహాయం అత్యవసరం. ఇప్పటికైనా దాతలు ముందుకు వచ్చి మోతీకుమార్‌కు ఆర్థిక సహాయం అందిస్తే, ఒక గిరిజన యువకుడి కల నెరవేరడమే కాకుండా, తెలంగాణ గర్వించదగిన మరో విజయగాథ రాయబడుతుంది.