ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి వైద్యం మంచి మార్గం
- జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి వైద్యం మంచి మార్గమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ హెల్త్ వీక్‌లో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఆయుష్ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. హోమియోపతి, యోగా, ఆయుర్వేద వంటి సంప్రదాయ వైద్య విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. హోమియోపతి సహజసిద్ధమైన, సురక్షితమైన వైద్య విధానమని, శరీరంలోని సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులు, అలర్జీలు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యల చికిత్సలో హోమియోపతి ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ గోపాల్ నాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ రవి కుమార్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉషారాణి, వైద్యులు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.




