ఇక యుద్ధమే
గుజరాత్ ముఠాకు తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు
వరంగల్‌ను అనాథను చేసిన కేసీఆర్, మోదీ l విభజన చట్టంలోని ఏ ఒక్కటీ మోదీ ఇయ్యలే
బిడ్డకోసం బీఆర్‌ఎస్‌ను తాకట్టు పెట్టిన కేసీఆర్ l వరంగల్ అభివృద్ధికి నాదీ బాధ్యత
హనుమకొండ, వరంగల్ రోడ్‌షోల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కేసీఆర్.. ఇదేనా నీ నీతి జాతి? బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టుపెట్టి వరంగల్ సీటును అమ్ముకున్నావ్.. నీ సంగతి నీ కార్యకర్తలే చూసుకుంటారు. నీ రంగు, రుచి, వాసన మా కార్యకర్తలకు తెలుసు. అందుకే డిసెంబర్‌లో బండకేసి కొట్టి బొక్కలు విరగ్గొట్టారు. నువ్వు దిగమంటే దిగడానికి కాంగ్రెస్ అల్లాటప్పా పార్టీ కాదు. వరంగల్ మిర్చి ఎట్ల ఉంటదో తెలుసా?
సీఎం రేవంత్‌రెడ్డి
వరంగల్/హనుమకొండ, మే 7 (విజయక్రాంతి): ఈ నెల 13న జరిగే తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఎన్నికల యుద్ధంలో గుజరాత్‌ను డకౌట్ చేసి బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పదేండ్లుగా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీలు తెలంగాణకు తీవ్ర నష్ట కలిగించాయని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌తో ఇక యుద్ధమేనని తేల్చి చెప్పారు. హనుమకొండ చౌరస్తా, వరంగల్ పోచమ్మ మైదాన్‌లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ‘డిసెంబర్‌లో సెమీ ఫైనల్స్ (అసెంబ్లీ ఎన్నికలు) జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఫైనల్స్. ఇటుపక్క రాహుల్‌గాంధీ, మీ అన్నను ఐన నేను ఉంటే.. ఆ పక్క మోదీ, అమిత్‌షా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో బీజేపీని ఓడించి కాకతీయ పౌరుషం చాటాలి. ఢిల్లీ సుల్తానులను ఓడించిన కాకతీయుల స్ఫూర్తితో ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగురవేయాలి.
పదేళ్ల పాటు అధికారంలో ఉండి రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను విస్మరించి వరంగల్‌ను నిర్లక్ష్యం చేసిన మోదీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడి వస్తున్నారు? కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, వరంగల్ స్మార్ట్‌సిటీ, అండర్ డ్రైనేజీ, వెయ్యిస్తంభాల ఆలయానికి తగిన గుర్తింపునివ్వడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. విభజన హామీలను అమలుచేసిన తర్వాతే ప్రధాని వరంగల్‌లో అడుగు పెట్టాలి. ఓఆర్‌ఆర్ పనులు పూర్తి చేయకుండా, కాజీపేట రైల్వే జంక్షన్‌ను రద్దుచేసే పరిస్థితి తెచ్చిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. దేశమంటే ఒక్క గుజరాతే అన్నట్లుగా వ్యవహరిస్తున్న మోదీ, వరంగల్ జిల్లాకు రావాల్సిన పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని లాథూర్‌కు ఎత్తుకుపోయారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. గిరిజన యూనివర్శిటీని పదేళ్ల పాటు నాన్చి ఎన్నికల ముందు నామమాత్రంగా ప్రారంభించారు. కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న వరంగల్‌ను అనాథగా మార్చారు’ అని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌కు నీతిలేదు
కాంగ్రెస్‌ను ఓడించాలనే లక్ష్యంతో బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని సీఎం విమర్శించారు. కుట్రలో భాగంగానే బీఆర్‌ఎస్ నాయకుడిని బీజేపీలోకి పంపి డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపారని దుయ్యబట్టారు. ‘పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి 400 సీట్లు రావాలట! వందరోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ గద్దె దిగాలట. కేసీఆర్.. ఇదేనా నీ నీతి జాతి? బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టుపెట్టి వరంగల్ సీటును అమ్ముకున్న కేసీఆర్.. నీ సంగతి నీ కార్యకర్తలే చూసుకుంటారు. నీ రంగు, రుచి, వాసన మా కార్యకర్తలకు తెలుసు. అందుకే డిసెంబర్‌లో బండకేసి కొట్టి బొక్కలు విరగ్గొట్టారు. నువ్వు దిగమంటే దిగడానికి కాంగ్రెస్ అల్లాటప్పా పార్టీ కాదు. వరంగల్ మిర్చి ఎట్ల ఉంటదో తెలుసా?’ అని హెచ్చరించారు. తులసి వనంలో గంజాయి మొక్కలా ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్‌రావు, అనకొండ ఆరూరి రమేష్ ఉన్నారని, అందుకే బీఆర్‌ఎస్ నాయకులు ఎవరూ ప్రచారం చేయడం లేదని అన్నారు. కడియం కావ్యను లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వరంగల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
పదేండ్లు కాంగ్రెస్‌దే అధికారం
ఏది ఏమైనా ఈ నెల 9వ తేదీలోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేస్తామని సీఎం తెలిపారు. అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసేందుకు సిద్ధంగా ఉండాని మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ‘తండ్రీ కొడుకులు వంద రోజులు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. కేసీఆర్‌కు ఇక పదవి కలే. రాష్ట్రంలో మరో పదేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనే’ అని తెలిపారు. జూన్ 30వ తేదీనాటికి వరంగల్‌కు రూ.3 కోట్లు నిధులు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా దోచుకున్న కేసీఆర్.. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. 2018 ఎన్నికల సమయంలో అన్నదాతలకు రైతుబంధు నిధులు ఇచ్చిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నదని ప్రశ్నించారు.
రైతుభరోసా నిధులపై ఎన్నికల సంఘం తనకు నోటీసులిచ్చిందని, అయినా ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు బుద్ధి ఉంటే ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రావాలని సూచించారు. రాష్ట్రంపై రూ.7 లక్షల కోట్ల అప్పు మోపిన కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వెంట కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్సీలు కొండా మురళీధర్‌రావు, పుల్లా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.




