బీజేపీ మోసం చేస్తే కేసీఆర్ ఆదరించారు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డి
హనుమకొండ, మే 18 (విజయక్రాంతి): బీజేపీలో కొందరు మోసం చేసి నన్ను రోడ్డు మీద నిలబెట్టారు. కొన ప్రాణంతో ఉన్న తనను కేసీఆర్ ఆదరించారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే తనకు వచ్చే డబ్బంతా పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తానని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. మేధావుల సభకు వెళ్లే వ్యక్తి మేధావై ఉండాలని, మోసగాళ్లను ఎన్నుకోవద్దన్నారు.
పుట్టినగడ్డకు సేవ చేయాలని సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పటి వరకు తాను సంపాదించిన మొత్తాన్ని ప్రజల కోసం ఖర్చు చేశానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారా ? అనే విషయంపై ఓటర్లు ఆలోచించాలని సూచించారు. కొవిడ్ సమయంలో 50 రోజుల పాటు రెడ్‌జోన్‌లోని ప్రజల సమస్యలు తీర్చేందుకు కష్టపడిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. జీఓ 46 రద్దు చేస్తానని ఇచ్చిన హామీని సీఎం విస్మరించార న్నారు. తనను గెలిపిస్తే రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తానన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లం సదయ్య తదితరులు పాల్గొన్నారు.






