calender_icon.png 11 November, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాప్‌లో పడొద్దు

19-05-2024 01:24:24 AM

హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణపై ఎల్ అండ్ టీ మళ్లీ కొర్రీలు పెడుతున్నది. మెట్రో నిర్వహణ నుంచి నష్టం లేకుండా ఎలా తప్పుకోవాలా అని దారులు వెదుకుతున్నది. నిజానికి మెట్రో కోసం టెండర్లు పిలిచినప్పుడే.. కాంట్రాక్టును ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో మిగతా పోటీ సంస్థలకంటే చాలా తక్కువకు ఎల్ అండ్ టీ టెండర్ వేసింది. సహజంగానే ప్రభుత్వం తక్కువ కోట్ చేసిన ఈ సంస్థకు మెట్రో నిర్మాణం, నిర్వహణ బాధ్యతను 60 ఏండ్లపాటు అప్పగించింది. అయితే, ఆరేండ్ల క్రితం మెట్రో ప్రారంభమైన తర్వాత సదరు సంస్థకు అసలు విషయం బోధపడింది.

అప్పటి నుంచి ఏదో ఒక సాకుతో మెట్రోను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నది. గతంలో ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉన్నదని, నిర్వహణ నష్టాలు అధికంగా ఉన్నాయని కొర్రీలు పెట్టి ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందింది. ఇప్పుడు మళ్లీ అదే పని మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. అయితే, నష్టం లేకుండా మెట్రోను వదలించుకోవటం, లేదంటే ప్రభుత్వం నుంచి ఎంతో కొంత రాబట్టుకోవటం అనే వ్యూహాన్ని అమలుచేస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అవకాశంగా తీసుకొన్నది.

ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ అవకాశం కల్పించటంతో మెట్రోలో ప్రయాణీకుల సంఖ్య భారీగా పడిపోయిందని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఎల్ అండ్ టీ వాదిస్తున్నది. మెట్రోకు ఒకవేళ ప్రభుత్వం నష్టాలను భర్తీచేయాలంటే ఉచిత బస్సు పథకం వల్ల నాలుగు నెలల కిందటికంటే మెట్రోలో ప్రయాణీకుల సంఖ్య ఏమైనా తగ్గిందా? పురుషుల సంఖ్య ఏమైనా పెరిగిందా? అనే అంశంపై శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి. 

ఒకవేళ మెట్రో బాధ్యతల నుంచి ఎల్ అండ్ టీ తప్పుకొని ప్రభుత్వం దానిని తీసుకొంటే.. ఉచిత బస్సు పథకం వ్యయంతోపాటు ఇప్పుడు ఎల్ అండ్ టీ భరిస్తున్న మెట్రో నష్టాలను కూడా అప్పుడు ప్రభుత్వమే మోయాల్సి ఉంటుంది. ఎల్ అండ్ టీ నిజంగా మెట్రో బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకొంటే.. ప్రభుత్వం ముందుగా ఆర్థిక, సాంకేతిక, న్యాయ నిపుణులను నియమించి సంస్థ కార్యకలాపాలపై అధ్యయనం చేయాలి. సంస్థను ప్రభుత్వం తీసుకొంటే భవిష్యత్తులో రాబోయే నష్టాలను ఇప్పుడే ఎల్ అండ్ టీ నుంచి తీసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ప్రజా ధనాన్ని కాపాడాలి. న్యాయ వివాదాలపట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి.   

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి