4 August, 2026 | 12:41 PM

ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

04-08-2026 11:41 AM

చెన్నై: డీఎంకే కీలక నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్,  సినీ నటి త్రీషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో స్టాలిన్ ను ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం తంజావూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఎం విజయ్, త్రీషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలకు వ్యతిరేకంగా అధికార టీవీకే (TVK) పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా, మంగళవారం తంజావూరుకు చెందిన టీవీకే (TVK) సెంట్రల్ డిస్ట్రిక్ట్ మహిళా విభాగం నిర్వాహకురాలు ఎస్. భైరవి తంజావూరు తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఉదయనిధి స్టాలిన్ పై ఫిర్యాదు చేశారు. దీనివల్ల ప్రతిపక్ష నాయకుడు అరెస్టయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. తంజావూర్‌లో ఉదయనిధి నివాసం ముందు తమిళనాడు పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

సోమవారం తంజావూరులోని పనగల్ భవనం సమీపంలో ఉదయనిధి నాయకత్వంలో జరిగిన డీఎంకే నిరసన కార్యక్రమం సందర్భంగా ఆ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. కావేరీ సమస్యపై ఉదయనిధి ప్రసంగిస్తున్నప్పుడు జనం త్రిష, త్రిష అని నినాదాలు చేయగా, ఆయన అసభ్యకరమైన, ద్వంద్వార్థం వచ్చేలా వ్యాఖ్యానించారని ఆ లేఖలో ఆరోపించారు. మహిళలను ఉద్దేశపూర్వకంగా కించపరచడం, సదరు నటితో పాటు సాధారణ మహిళలకు మానసిక వేదన కలిగించడం, అలాగే ప్రజా అశాంతిని సృష్టించే ఉద్దేశంతో ఆ ఘటనకు సంబంధించిన 2 నిమిషాల 39 వీడియోను 'X' (ట్విట్టర్) సోషల్ మీడియా వేదికపై కావాలనే ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆయనపైనా, డీఎంకే ఐటీ విభాగం అధికారులపైనా ఆరోపణలు చేశారు.


టీవీకే (TVK) జాతీయ ప్రతినిధి పళ సెల్వకుమార్ న్యూఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ (NCW)కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఉదయనిధి నుంచి వివరణ కోరుతూ నోటీసు జారీ చేయాలని, అలాగే ఆయన బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా చూడాలని అధికార పార్టీ కమిషన్‌ను కోరింది. కావేరీ జలాలపై తమిళనాడు హక్కులను కాపాడేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, డీఎంకే మొదట తంజావూరులో ఈ నిరసనను చేపట్టింది.