కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు పక్ష ప్రభుత్వం
మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను రైతులు
సద్వీనియోగం చేసుకోవాలి
రైతుల సమస్యలను
పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాం
జీళ్ళ చెరువు లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని
ప్రారంభించిన ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి
కూసుమంచి, ఏప్రిల్ 7(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పక్ష ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తోందని ఖమ్మ పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. మంగళవారం కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో సోసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్క జొన్నల రైతుల కోసం ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులకు సరైన మద్దతు ధరను అందించి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మధ్యవర్తుల బాధలు లేకుండా రైతులకు నేరుగా లాభం చేకూరే విధంగా ఈ కొనుగోలు కేంద్రం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా జీళ్ళచెరువు, పరిసర ప్రాంతాల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు ఇది ఒక కీలక అడుగని అన్నారు.
కొంత మంది రైతులు సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మునిగేపల్లి, కేశ్వాపురం, లోక్యతండా, కోక్యతండా, కూసుమంచి రైతులు ఎంపీ రఘురాంరెడ్డిని కోరగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని హామి ఇచ్చారు. ప్రభుత్వంతో, అధికారులతో మాట్లాడి రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందో, ఆ విధంగా ముందుకు వెళ్తామని హామి ఇచ్చారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఐతగాని వెంకటరమణ,నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండపర్తి సురేష్, సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, తహసీల్దార్, ఎంపీడీవో, ఏడీఏ, ఏవో, మార్క్ఫెడ్ ,వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు..




