ఖజానాకు కిక్
సర్కార్‌కు మద్యమే ప్రధాన ఆదాయ వనరు
- పుష్కర కాలంగా పెరుగుతున్న అమ్మకాలు, అమ్దానీ
- 2025--26లో రూ.44,557 కోట్లకు చేరిన ఎక్సైజ్ శాఖ ఆదాయం
- గత డిసెంబర్‌లో రూ.5,051 కోట్ల లిక్కర్ విక్రయం
- 2015--16లో ఆదాయం రూ.12,706 కోట్లే
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సర్కార్‌కు లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పుష్కర కాలంగా మద్యం అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. లిక్కర్ అమ్మకాలతో రూ. 3 వేల నుంచి రూ. 4 వేల కోట్ల వరకు ఆదాయం ఏటా పెరుగుతూ రాష్ట్ర ఖజానాలో జమవుతున్నది. ఎక్సైజ్ శాఖ కూడా మద్యం విక్రయాలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించింది.
తద్వారా లిక్కర్ అమ్మకాలతో వచ్చే ఆదాయంతో ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతున్నది. 2015-- 16 ఆర్థిక సంవత్సరంలో రూ.12,706 కోట్ల ఆదాయం ఆర్జించిన ఎక్సైజ్ శాఖ.. 2025- -26లో రికార్డుస్థాయిలో రూ.44,557 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారి రూ. 44 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం రికార్డుగా చెప్పవచ్చు.
ఇందులో మద్యం అమ్మకాల ద్వారా రూ.40,209 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా 2,620 ఏ -4 మద్యం షాపులు ఉండగా, వాటి ద్వారా ఏటా రెంటల్ ఫీజ్ ద్వారా రూ.1,771 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక రాష్ట్రంలోని 1,214 బార్ల ద్వారా రూ.549 కోట్ల ఆదాయం వస్తున్నది. 2025-- 26లో ఎక్సైజ్ శాఖకు 95,628 దరఖాస్తుల ద్వారా రూ.2,869 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయి ఆదాయం రావడం ఇదే మొదటిసారి.
2024- 25లో రూ.37,487 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 2025--26లో 7 శాతం వృద్ధిని సూచిస్తున్నది. ఒక డిసెంబర్ నెలలోనే రికార్డుస్థాయిలో 5,051 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2018-19లో రూ.20,859 కోట్లుగా ఉ న్న ఎక్సైజ్ ఆదాయం, ఏడేండ్లలో రెట్టింపునకుపైగా పెరిగి రూ.40 వేల కోట్ల మార్కును దాటడం విశేషం

పెరిగిన లిక్కర్, తగ్గిన బీర్ల అమ్మకాలు
2025-- 26లో 382.91 లక్షల కేసుల లిక్కర్, 387.34 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది కంటే ఈసారి 2 శాతం లిక్కర్ సెల్స్ పెరుగగా, బీర్ల అమ్మకాలు 9 శాతం తగ్గడం విశేషం. 2024-- 25లో 372.25 లక్షల కేసుల లిక్కర్, 536.13 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.






