జమ్ముకశ్మీర్ బీజేపీ ఇన్‌చార్జిగా కిషన్‌రెడ్డి
- అసెంబ్లీ ఎన్నికలకు బాధ్యుడిగా నియామకం
- కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానం
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డికి పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. త్వరలో జరగనున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయనను బీజేపీ ఇన్‌చార్జిగా నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప ఫలితాలను రాబట్టకపోయినా, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అంచనాలకు మించే విజయం సాధించారని అధిష్ఠానం సంతృప్తి వ్యక్తంచేసింది.
8 ఎంపీ సీట్లు సాధించి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో తెలంగాణ ఎంపీలు కీలకమయ్యారని, ఇందుకు కిషన్‌రెడ్డి పనితీరే కారణమని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనను ఎంతో కీలకమైన జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి పార్టీ ఇన్‌చార్జిగా నియమించింది. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రదాడులు తగ్గి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది.
దేశమంతా కశ్మీర్ ఎన్నికల గురించే చర్చించుకుంటున్న పరిస్థితుల్లో కిషన్‌రెడ్డి ఇక్కడ బీజేపీని ఎలా ముందుకు తీసుకుపోతారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ మాదిరిగానే కశ్మీర్‌లో ఎన్నికల్లోనూ కిషన్‌రెడ్డి తనదైన శైలిలో బీజేపీని విజయతీరాలకు చేరుస్తారని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల మంత్రిత్వ శాఖను నిర్వహించిన కిషన్‌రెడ్డికి ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై అవగాహన ఉందని, కశ్మీర్‌లో ఈ అనుభవం ఆయనకు పనికి వస్తుందని అంటున్నారు. ఏదేమైనా ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో సత్తా చాటడం మరొక ఎత్తు అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.






