రాయ్‌బరేలీకే రాహుల్ జై
- వయనాడ్‌ను వదులుకోవాలని నిర్ణయం
- ఆ స్థానం నుంచి ప్రియాంకగాంధీ పోటీ
- అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్
- ప్రతిపక్ష నేతగా ఉండేందుకు రాహుల్ నో!
న్యూఢిల్లీ, జూన్ 17: 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ వయనాడ్‌కు రాహుల్‌గాంధీ రాజీనామా చేసే విషయాన్ని ఖర్గే ప్రకటించారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీకే ఎంపీగా రాహుల్‌గాంధీ కొనసాగుతారని స్పష్టం చేశారు.
రాహుల్‌ను రెండు సార్లు భారీ మెజారిటీతో గెలిపించిన వయనాడ్ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా పోటీ చేయనున్నట్లు ఖర్గే తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్‌బరేలీ నుంచి రాహుల్ బరిలోకి దిగి రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. దీంతో ఏదో స్థానాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వయనాడ్‌నే వదులుకోవాలని రాహుల్ నిర్ణయించారు. రాహుల్ రాజీనామా తర్వాత వయనాడ్ స్థానానికి ఆర్నెల్లలోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రతిపక్ష నేత పదవి నాకొద్దు
18వ లోక్‌సభలో ప్రతిపక్ష నేత బాధ్యత రాహుల్‌గాంధీ తీసుకుంటారని కొంతకాలం గా ఊహాగానాలు వినిపించాయి. అయితే, తా జా సమాచారం ప్రకారం రాహుల్ అందుకు అంగీకరించలేదని, దీంతో ముగ్గురు సీనియర్ నేతలవైపు ఏఐసీసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు కుమారి సెల్జా, గౌరవ్ గొగొయి, మనీశ్ తివారీ ఈ ప్రతిపక్ష నేత రేసులో ఉన్నట్లు సమాచారం. దశాబ్దం తర్వాత ఈ లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కింది. విపక్ష ఇండియా కూటమిలో 232 సీట్లకుగాను 99 స్థానాలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. దీంతో కాంగ్రెస్ సభ్యుడే ప్రతిపక్ష నేతగా ఉండటం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ హోదా లభిస్తుంది. ఫలితంగా కూటమిని నియంత్రించే అవకాశం కాంగ్రెస్‌కు లభిస్తుంది. కానీ, ఈ పదవికి రాహుల్ ఒప్పుకోకపోవడంతో త్వరలోనే మరో అభ్యర్థిని కాంగ్రెస్ నిర్ణయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మొదటిసారి ప్రియాంక పోటీ
రాహుల్ స్థానంలో వయనాడ్ నుంచి ప్రియాంక బరిలోకి దిగుతారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీంతో ఆమె మొదటిసారి ప్రత్యక్ష పోటీలోకి రానున్నారు. ఇప్పటివరకు ప్రియాంకగాంధీ పార్టీ ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆమె ప్రాతినిధ్యం వహించే రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.
రాహుల్ ఎలాగో వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి, కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో గాంధీ కుటుంబసభ్యులకే అవకాశం వస్తుందని ఊహాగానాలు వచ్చాయి. దీంతో ప్రియాంక వైపే కాంగ్రెస్ మొగ్గు చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఊహించాయి. కానీ, అనూహ్యంగా ఆ స్థానం నుంచి కూడా రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించి ప్రియాంక పోటీపై ఉన్న ఊహాగానాలకు చెక్ పెట్టింది.
2004లో రాజకీయాల్లోకి..
ప్రియాంకగాంధీ 2004 వరకు రాజకీయాల్లోకి రాలేదు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పుడు పార్టీలో ఎలాంటి పదవిని ప్రియాంకకు కేటాయించలేదు. అనంతరం 2014లో కోలుకోలేనంతగా కాంగ్రెస్ భారీ ఓటమి చవిచూసింది. దీంతో మాజీ ఇందిరాగాంధీ పోలికలు ఉన్న ప్రియాంకను తీసుకురావాలని భావించి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రియాంకను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.






