30-07-2025 09:44:01 PM
ఎస్‌ఐ విక్రమ్..
నవాబు పేట్: చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎస్సై విక్రమ్(SI Vikram) అన్నారు. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, మూఢ నమ్మకాలను నమ్మవద్దని, బాల్య వివాహాల నిర్మూలనకు, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అంటరానితనం నేరమని, ఎవరైనా కుల వివక్ష చూపిన, అంటరానితనం పాటించిన వారి పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని వివరించారు. సమాజంలో చట్ట ప్రకారం ప్రతి ఒక్కరు జీవించాలని అప్పుడే వారు సమాజంలో మెప్పు పొందుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.