కోహ్లీకి జరిమానా..
కోల్‌కతా: బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా పడింది. ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తన ఔట్‌పై అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకు గానూ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ సోమవారం తెలిపింది. ‘ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగి కోహ్లి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8 లెవెల్ నేరానికి పాల్పడ్డాడు. తన తప్పును మ్యాచ్ రిఫరీ ఎదుట అంగీకరించడంతో మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాం. మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్.. దానికే కట్టుబడి ఉన్నామంటూ’ తెలిపింది. బెంగళూరు ఇన్నింగ్స్ సమయంలో మ్యాచ్‌లో హర్షిత్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కోహ్లీ ఔటయ్యాడు.
క్రీజు బయట ఉన్న కోహ్లీ ఫుల్‌టాస్‌ను అంచనా వేయడంలో విఫలమై బంతిని గాల్లోకి లేపడంతో అక్కడే ఉన్న హర్షిత్ రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిదంటూ అంపైర్‌ను రివ్యూ కోరేందుకు వెళ్లాడు. కానీ అప్పటికే అంపైర్లు థర్డ్ అంపైర్‌కు సిఫార్సు చేశారు. రిప్లులో బంతి నడుము కంటే తక్కువ ఎత్తులో వచ్చిందంటూ టీవీ అంపైర్ ఔటిచ్చాడు. అంపైర్ నిర్ణయంపై కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహంగా పెవిలియన్ చేరాడు.






