కోల్‌కతా X బెంగళూరు
కోల్‌కతా:
ఐపీఎల్లో రసవత్తర సమరాల పరంపర కొనసాగుతోంది. బరిలోకి దిగిన ప్రతి జట్టు బాదుడే పరమావధిగా దూసుకెళ్తుండగా.. లీగ్‌లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో రాణించాలని బెంగళూరు చూస్తుంటే.. సొంతగడ్డపై సత్తాచాటేందుకు కోల్‌కతా సిద్ధమైంది. మరింకెందుకు ఆలస్యం డబుల్ మజాను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి..
ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి మ్యాచ్‌లో బెంగళూరు, కోల్‌కతాలు అమితుమీ తేల్చుకోనున్నాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న కోల్‌కతాను సొంతగడ్డపై బెంగళూరు ఏ మేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బెంగళూరు బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతుంది. కోల్‌కతా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. మరోవైపు బెంగళూరు ఏడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో అట్టడుగు స్థానంలో ఉంది.
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై బెంగళూరు ప్రతీ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో గెలుపే ప్రధాన లక్ష్యంగా డుప్లెసిస్ సేన బరిలోకి దిగనుంది. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ పరుగులు సాధిస్తున్నా.. అతడికి సరైన సహకారం లభించడం లేదు. మిడిలార్డర్ రాణించాల్సిన అవసరముంది. మరోవైపు కోల్‌కతా బ్యాటింగ్ శత్రు దుర్బేధ్యంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా పించ్‌హిట్టర్ సునీల్ నరైన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.






