16 July, 2026 | 5:39 AM

పంజాబ్ X గుజరాత్

21-04-2024 12:40 AM

ముల్లాన్‌పూర్:

ఐపీఎల్లో రసవత్తర సమరాల పరంపర కొనసాగుతోంది. బరిలోకి దిగిన ప్రతి జట్టు బాదుడే పరమావధిగా దూసుకెళ్తుండగా.. లీగ్‌లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో రాణించాలని బెంగళూరు చూస్తుంటే.. సొంతగడ్డపై సత్తాచాటేందుకు కోల్‌కతా సిద్ధమైంది. మరింకెందుకు ఆలస్యం డబుల్ మజాను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి.. 

గత మ్యాచ్‌లో ముంబైని ఓడించినంత పని చేసిన పంజాబ్ కింగ్స్ సొంత మైదానంలో గుజరాత్‌తో పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరగనున్న రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ను మట్టి కరిపించి విజయం అందుకోవాలని పంజాబ్ చూస్తోంది. శిఖర్ ధవన్ దూరం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత మ్యాచ్‌లో సారథిగా వ్యవహరించిన సామ్ కరన్ ఓపెనర్‌గా వచ్చినా జట్టుకు శుభారంభం అందించలేకపోయాడు. టాపార్డర్ ఫామ్‌లో లేకపోవడంతో మిడిలార్డర్‌లో అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్‌పై అధిక భారం పడుతోంది. దీనికి తగ్గట్లే ఒత్తిడిలో చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఈ జోడీ మరో సారి కీలకం కానుంది. మరోవైపు గుజరాత్ పరిస్థితి కూడా అంతం తమాత్రంగానే ఉంది. పాయింట్ల పట్టికలో గుజరాత్, పంజాబ్‌లు వరుసగా 8,9వ స్థానంలో ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇరుజట్లు నాలుగుసార్లు తలపడగా.. రెండు జట్లూ రెండేసి విజయాలు నమోదు చేసుకున్నాయి.