7 April, 2026 | 6:04 AM

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలి

07-05-2024 01:03 AM

కాంగ్రెస్ 14 స్థానాలు గెలిచి తీరుతుంది 

ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ 

చామల కిరణ్‌ను ఆదరించాలి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు(నాంపల్లి), మే6: నియంతృత్వ బీఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయడమే లక్ష్యమని, పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆగమైందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం నాంపల్లిలో మండల స్థాయి బూత్ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు అభివృద్ధిని చేయలేరని బీజేపీ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు, తాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  

పదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 స్థానాలు గెలిచి తీరుతుందని స్పష్టంచేశారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు. ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. రైతుబంధు రాని వారికి ఈ నెల 9 నుంచి ఖాతాల్లో డబ్బులు పడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పుణ్య కైలాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, నాంపల్లి జడ్పీటీసీ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.