calender_icon.png 2 August, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత మహిళకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు

02-08-2025 12:21:08 AM

  1. ఈ అవార్డుకు ఎంపికైన తొలి కార్మికురాలు
  2. రాజన్న సిరిపట్టు పీతాంబరానికి దక్కిన గౌరవం
  3. 45 రోజుల పాటు శ్రమించి చేనేత అద్భుతాన్ని సృష్టించిన రేఖ

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 1 (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత మహిళ కళాకారిణి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు. చేనేత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది రేఖను ఎంపికైంది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి మహిళా చేనేత కార్మికురాలు వెల్ది రేఖనే కావడం విశేషం.

చేనేత రంగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సతీమణి రేఖ చేనేత మగ్గంపై సృష్టించిన రాజన్న సిరిపట్టు పట్టు పీతాంబరానికి ఈ అరుదైన గౌరవం దక్కింది. 45 రోజులపాటు శ్రమించి చేనేత మగ్గంపై రూపొందించిన పట్టుచీరను అధికారులు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఖ్యాతిని తెలియజేప్పేలా చేనేత దంపతులు హరిప్రసాద్, రేఖ ఈ పట్టు పీతాంబరాన్ని నేశారు. 48 ఇంచుల వెడల్పు, అయిదు మీటర్ల పొడవుతో కూడిన ఈ పట్టు చీరలో కాకతీయుల శౌర్యానికి గుర్తు అయిన కమాన్‌తో పాటు వేములవాడ రాజన్న కోడె మొక్కులను సూచించే జరీబుటాలను పొందుపరిచారు. సిరిసిల్ల చేనేత పనితనానికి గుర్తుగా నూలు పడుతున్న మహిళ బొమ్మతో కూడిన జరీబుటాను పట్టుచీరపై నేసి అబ్బురపరిచారు. 

దంపతుల అద్భుతాలు

సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారులైన వెల్ది హరిప్రసాద్, రేఖ దంపతులు గత దశాబ్ద కాలంగా చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నేత పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్ల ఖ్యాతిని ఇముడించేలా రాజన్న సిరిపట్టు చీరను రూపొందించారు. అంతేకాక చేనేత రంగంలో కనీ వినీ ఎరగని రీతిలో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర, దబ్బనంలో దూరే పట్టుచీరతో పాటు జి-20 లోగోను మగ్గంపైనేసి సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో సైతం చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన ప్రతిభను ప్రదర్శించారు. హరిప్రసాద్ వేసిన పలు పట్టుచీరలను వస్త్రాలుగా కుట్టి మిస్ వరల్డ్ పోటీదారులు రాంప్ వాక్ చేశారు.