శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్
తాత్కాలికంగా బాధ్యతల అప్పగింత
చంపత్‌రాయ్, అనిల్‌మిశ్రా రాజీనామాలకు ఆమోదం
ట్రస్ట్ అత్యవసర సమావేశంలో నిర్ణయం
విరాళాల నిధుల దుర్వినియోగంపై ట్రస్ట్ విచారం
ఆలయ పరిధిలో పటిష్ట నిఘా ఏర్పాటుకు చర్యలు
౨౨న ట్రస్ట్ తదుపరి సమావేశం
లక్నో, జూలై౬: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా కృష్ణమోహన్ నియమితులయ్యారు. అయోధ్య రామ్‌మందిర విరాళాల చోరీ అంశంపై సోమవారం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌దాస్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో సభ్యులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామాలనూ ఆమోదించారు. ట్రస్ట్ తదుపరి సమావేశాన్ని ఈనెల ౨౨న నిర్వహిస్తామని ప్రకటించారు. అనంతరం ఆలయ విరాళాల చోరీపై ట్రస్ట్ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. విరాళాల చోరీ ఆలయంతో పాటు ట్రస్ట్ ప్రతిష్ఠను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వివాదం కారణంగా ఆలయ నిర్వహణపై భక్తుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణ, పరిపాలనా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, ఆ విషయాన్ని ట్రస్ట్ అంగీకరిస్తున్నదని ప్రకటించారు. లోపాలను సకాలంలో గుర్తించి సరిదిద్దలేకపోయినందుకు చింతిస్తున్నామని తెలిపారు. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) దర్యాప్తుపై తమకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని, భవిష్యత్తులో చోరీ ఘటనలు పునరావృతం కాకుండా భద్రతాపరంగా పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
భక్తుల నమ్మకాలను, విశ్వాసాలను కాపాడటమే తక్షణం తమ ముందున్న కర్తవ్యమని వ్యాఖ్యానించారు. అనంతరం విరాళాల లెక్కింపుపై సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను సమీక్షించారు. అత్యవసర సమావేశంలో ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్‌గిరి, స్వామి వాసుదేవానంద్ సరస్వతి, నృపేంద్ర మిశ్రా పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ అడ్వొకేట్ పరాశరన్, ఉత్తరప్రదేశ్ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్ హాజరయ్యారు.
నమ్మకస్తుడు కృష్ణమోహన్
ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ తాత్కాలిక నియామకం వెనుక బలమైన కారణం ఉంది. విరాళాల చోరీ తర్వాత ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కృష్ణమోహన్‌కు మొదటి నుంచి నిజాయతీగల వ్యక్తిగా పేరుండటంతోనే ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిసింది. మరోవైపు, చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదించిన ట్రస్ట్, ఇక వారి స్థానాల్లో కొత్తవారిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నది.
ప్రస్తుతం ఈ స్థానాల భర్తీకి బజరంగ్ బాంగ్డా, నీరజ్ దౌనేరియా అనే ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ట్రస్ట్ నిబంధనల ప్రకారం రాజీనామాలకు ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ఈ మెజార్టీతోనే ట్రస్ట్ చంపత్‌రాయ్, అనిల్‌మిశ్రా రాజీనామాను ట్రస్ట్ ఆమోదించింది. మరోవైపు, సిట్ ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నది. అలాగే, ఐదేళ్ల విరాళాల లెక్కలు తేల్చేందుకు రీఆడిట్ సైతం నిర్వహిస్తున్నది.






