8 May, 2026 | 4:59 AM

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

23-06-2024 02:15 AM
  • ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ 
  • ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

మంచిర్యాల/రాజన్న సిరిసిల్ల, జూన్ 22 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాలలో సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ రైతులకు రూ.లక్ష రుణమాఫీ అంటూ నాలుగు విడతలుగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నదని చెప్పారు.

బీజేపీ ప్రభుత్వం జాతీయ రహదారిని కేవలం వ్యాపారులు, పెట్టుబడిదారుల కోసమే మార్చాలని చూస్తున్నదని విమర్శించారు. ఉన్న రహదారి వెంట ఎక్స్‌టెన్షన్ చేస్తే తక్కువ నష్టంతో పూర్తవుతుందన్నారు. హాజీపూర్ మండలంలో పంటలు ఎండిపోయా యని ప్రచారం చేస్తున్నారని, ఎండిన పంటలను చూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి చిత్రపటానికి సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో రైతులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 

జనగామలో

జనగామ టౌన్, జూన్ 22: జనగామ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ రాజమౌళి, సర్వల నర్సింగరావు, చెంచారపు బుచ్చిరెడ్డి, బడికే ఇందిరా, బనుక శివరాజ్‌యాదవ్ వంగాల కల్యాణిమల్లారెడ్డి, నిమ్మతి మహేందర్‌రెడ్డి, మేడ శ్రీనివాస్, దాసరి క్రాంతి, సుంకరి శ్రీనివాస్ పాల్గొన్నారు.