ఈ-కార్ రేసులో అణాపైసా అవినీతి లేదు.. పొన్నం మాటల్లోనే తేలింది
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో అవినీతి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతోనే తేలిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ-కార్ రేసు కేసులో అణాపైసా అవినీతి జరగలేదని, తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసుపై ముందుకు వెళ్తే న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. హెచ్ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు, హెచ్ఎండీఏకు ఆ మేరకు స్వతంత్రత ఉందని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసును తప్పుదోవపట్టిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియ్యా.. మంత్రులా.. ఎవరనేది తెలియాలన్నారు. అలాగే ఓఆర్ఆర్ లీజు అంశంపై సెట్ ఏర్పాటుపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. టీఓటీ పద్దతి దేశంలో ఇప్పటికే అమలులో ఉందని, ఓఆర్ఆర్ లీజు డబ్బు రైతు రుణామాఫీకి వాడినట్లు ఆయన వెల్లడించారు.
అప్పటి కేబినేట్ సబ్ కమిటీ.. ఓఆర్ఆర్ లీజుకు సూచించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. నేషనల్ హైవే సంస్థ తరహాలోనే ఓఆర్ఆర్ లీజు ఇచ్చామన్నారు. అవినీతి జరిగితే ఇంకా ఆ ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదు..? అని ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డి ఆరోపణలపై హెచ్ఎండీఏ పరువు నష్టం కేసు వేసిందని, ఆ కేసు ఇంకా అలాగే ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకొస్తాయి..?, ఓఆర్ఆర్ లీజు అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సూచించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకపోతే కక్షసాధింపు కేసుగా అనుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఫార్ములా ఈ-రేసులో కుంభకోణం జరిగింటే కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయాట్లేదని, కోకాపేట భూములపై రూ.10 వేల కోట్ల స్కామ్ అంటున్నారు. స్కామ్ అయితే కోకాపేట భూముల అమ్మకం కూడా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.






