గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి
* కొంపల్లిలో వైభవంగా గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
* పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి
పాపన్నపేట: మండల పరిధిలోని కొంపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొని గ్రామదేవతలు శ్రీ దుర్గాదేవి, పెద్దమ్మ తల్లి, గంగమ్మ దేవి, భూలక్ష్మి దేవి, నవగ్రహ, పోచమ్మ దేవి, నల్లపోచమ్మ దేవి, కాళికా దేవి, ఎల్లమ్మదేవి, లింగమయ్య కాటమయ్య దేవతల విగ్రహాల త్రయాహీనక యాగ ప్రతిష్ఠాపన పూజలు, హోమంలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు.
ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామదేవతల ఆశీస్సులతో గ్రామాలు సుభిక్షంగా, శాంతి సమృద్ధులతో ఉండాలని ఆకాంక్షించారు. మన సంప్రదాయాలు, ఆచారాలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలని, గ్రామదేవతల పూజలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కొంపల్లి గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు జగన్, నాయకులు సోములు, వెంకటేశం, అంథోని, బద్రి మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






