14 April, 2026 | 1:35 AM

కవిత చర్యలకు తడబడుతున్న కేటీఆర్

14-04-2026 12:16 AM

ఎమ్మెల్యే నాగరాజు విసుర్లు

సుబేదారి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీసుకుంటున్న నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అసహజ స్థితిలోకి నెట్టాయని, దీనితో ఆయన తడబడుతూ ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సహకారంతో ఎదిగి, వారినే పార్టీ నుంచి బయటకు పంపించారని విమర్శించారు.

బిఆర్‌ఎస్ పార్టీని తిరిగి టిఆర్‌ఎస్ గా మారుస్తామనే ప్రకటనలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులకు అండగా నిలుస్తుందని తెలిపారు. బంగారు తెలంగాణ పేరుతో అప్పులపాలు చేసి దోపిడీ చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీపై బిఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీకి పలు సందర్భాల్లో కర్రు కాల్చి వాత పెట్టిన సిగ్గు రావట్లేదన్నారు.రాబోయే గ్రేటర్ వరంగల్, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు అదే తీర్పు ఇస్తారని చెప్పారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో కూడా చైర్మన్, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామి రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.