06-05-2025 01:03:01 PM
తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదు
ఎన్నికల ముందు ప్రజలకు కేసీఆర్ చిలుకకు చెప్పినట్లు చెప్పిండు
రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవా?
హైదరాబాద్: ''నేను ఎక్కడికి పోయినా నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారు" అని నిన్న రేవంత్ రెడ్డి అన్న మాటలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారు" కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీని, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం, భరిస్తాం.. తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు రాష్ట్ర భవిష్యత్తుకు శాపం పెట్టినట్లు ఉన్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి.. అత్యంత అసమర్థ, దక్షతలేని సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ చిలుకకు చెప్పినట్లు చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షరసత్యాలు అయ్యాయని వెల్లడించారు. తనకు పరిపాలన చేతకాని సీఎం రేవంత్ రెడ్డి కాడి కింద పడేశారని తెలిపారు.
అధికారంలోకి వస్తారనే నమ్మకం లేక అడ్డగోలుగా హామీలు ఇచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగుల త్యాగాల గురించి ఎన్నో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడెలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కిన ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అవమానిస్తున్నారని సూచించారు. ఉద్యోగులకు, ప్రజలకు మధ్య చిచ్చుపెట్టేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని వివరించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నారు. అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవా? అని ప్రశ్నించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఉన్నప్పుడు మంచిగా వచ్చిన కరెంట్, మంచినీళ్లు ఇప్పుడెందుకు వస్తలేవన్నారు. బీఆర్ఎస్ హయాంలో దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణ ఇవాళ దివాలా ఎందుకు తీసింది? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఆదాయం పెరిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టామన్నారు. బీఆర్ఎష్రూ. 6 లక్షల కోట్లు అప్పులు చేసిందని గతేడాది అన్నారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) రూ. 8.50 లక్షల కోట్లు అప్పు చేసిందని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి రూపాయి కూడా ఆదాయం పెంచలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ. 2 వేల కోట్లు అప్పులు మాత్రమే చెల్లిస్తోందన్న కేటీఆర్ అప్పుల్లో తెలంగాణ 28వ స్థానంలో ఉందని పార్లమెంట్ లో కేంద్రమే చెప్పిందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వైఖరి వల్ల జీఎస్టీ, రిజస్టేషన్ల ఆదాయం తగ్గిందన్నారు. స్వయంగా సీఎం బజారుకెక్కి మాకు అప్పు పుట్టడం లేదని అంటారా?, భూములు తాకట్టుపెట్టి, లంచం ఇచ్చి అప్పు తెచ్చుకునే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని గరం అయ్యారు. రేవంత్ రెడ్డి 43 సార్లు ఢిల్లీకి వెళ్లి 43 పైసలు కూడా తీసుకురాలేదని కేటీఆర్ చమత్కరించారు.