calender_icon.png 13 November, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీకి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

13-11-2025 12:00:00 AM

  1. మేము చట్టానికి, ప్రజలకు మాత్రమే జవాబుదారీ
  2. పోలీస్ అధికారుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు గోపిరెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): రాష్ర్ట డీజీపీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖం డించింది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ర్ట పోలీస్ ఉన్నతాధికారిపై అభ్యంతరకర భాషలో మాట్లాడటం సరికాదని, కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని సంఘం డిమాండ్ చేసింది.

ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు వై. గోపిరెడ్డి బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత అసభ్యంగా, అనుచితంగా, అనాగరికంగా ఉన్నాయన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం దురదృష్టకరం, అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత డీజీపీ నాయకత్వంలో తెలంగాణ పోలీసులు ఎన్నడూ లేనంత అప్రమత్తతతో, నిష్పక్షపాతంగా పనిచేస్తున్న విషయం రాష్ర్ట ప్రజలందరికీ తెలుసు.. మేము చట్టానికి, ప్రజలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాము, ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయం. శాంతిభద్రతల పరిరక్షణకే మా ప్రథమ ప్రాధాన్యం, అని గోపిరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని డీజీపీపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలని గోపిరెడ్డి డిమాండ్ చేశారు.