16-07-2025 12:00:00 AM
హనుమకొండ, జులై 15 (విజయ క్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల జర్నలిజం విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి సామాజిక, విద్య, వైద్య, ఆర్థిక, వ్యవసాయ రంగం పై రచించిన వ్యాస సంపుటి పుస్తకం కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సామాజిక, ఆర్థిక, వ్యవసాయ రంగాలపై అవగాహన పెంపొందించుకొని వ్యాసాలు రచించడం ఒక మంచి సాంప్రదాయమని, సమాజంలో నెలకొన్న అంశాలను ఎన్నుకొని రచించడం గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేయూ రిజిస్టర్ ఆచార్య రామచంద్రం మాట్లాడుతూ సామాజిక అవగాహనను కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే ఇటువంటి రచనలు చేయగలరని ఆయన అన్నారు.
ఆరట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుకరి జ్యోతి మాట్లాడుతూ అధ్యాపకులు సామాజిక సమస్యలను అవగాహన చేసుకుని రచనల ద్వారా సమాజానికి తెలియజేయడం మంచి కార్యాచరణ ప్రణాళికాన్ని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిరెడ్డి, డాక్టర్ హరికుమార్, సీనియర్ పాత్రికేయులు డి.రమేష్, కేయూ పీఆర్‌ఓ డాక్టర్. పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.