గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి
ఎమ్మెల్సీ తాడిపర్తి జీవన్‌రెడ్డి
జగిత్యాల, మే 31 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధిస్తున్న గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాడిపర్తి జీవన్‌రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 406 ప్రభుత జూనియర్ కళాశాలలు ఉండగా, వాటి పరిధిలో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారన్నారని, బోధన గంటల బట్టి వారి వేతనం ఉంటుందని, కానీ పండుగలు, వేసవి సెలవుల నేపథ్యంలో వారి వేతనంలో కోతపడుతున్నదని లేఖలో జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే జీతమైనా సకాలంలో అందడం లేదని, రెండు, మూడు నెలలకోసారి అందుతున్నదన్నారు.
దీంతో అధ్యాపకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారన్నారు. ఏటా విద్యా సంవత్సరం ఆరంభ సమయంలో వారి పోస్టులు రెన్యువల్ అవుతాయని, ఇలా ఏటికేడు వారికి ఉద్యోగం ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ నెలలోనే రాష్ట్రప్రభుత్వం వారి కొలువులను ఆటో రెన్యువల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రెగ్యులర్ అధ్యాపకులకు అవకాశం కల్పించిన విధంగానే, సప్లిమెంటరీ పేపర్ వాల్యూవేషన్‌లోనూ గెస్ట్ అధ్యాపకులకు అవకాశం కల్పించాలని కోరారు.






