24 August, 2026 | 2:20 AM

12 గంటల్లోనే బాధితులను విడిపించిన కుకునూరుపల్లి పోలీసులు

24-08-2026 01:44 AM

కొండపాక, ఆగస్టు 23: డబ్బుల కోసం ఇద్దరిని కిడ్నాప్ చేసి, రూ.20 లక్షలు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించిన ఘటనలో సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 12 గంటల్లోనే బాధితులను కాపాడారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన మఠం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

తన బంధువైన మఠం అనిల్ (34), మఠం రాజుతో కలిసి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయం సమీపానికి వెళ్లగా, శివ, పర్వతాలు మరి కొంత మందితో అడ్డుకుని దాడి చేశారని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అనిల్, రాజులను కార్లలో బలవంతంగా ఎక్కించుకుని హైదరాబాద్ వైపు తీసుకెళ్లారని, రూ.20 లక్షలు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించినట్లు తెలిపారు. అయితే శ్రీనివాస్ వారి  నుంచి తప్పించుకుని బంధువులకు సమాచారం అందించి పోలీసులను ఆశ్రయించాడు.

ఫిర్యాదు అందుకున్న కుకునూరుపల్లి ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాధితులు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ పట్టణ శివారులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీస్ సిబ్బంది రమేష్, రాజు, రాజేష్, ఆర్సీ రెడ్డితో కలిసి అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. పోలీసుల రాకను గమనించిన కిడ్నాప్ చేసిన నిందితులు అనిల్, రాజులను అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో పోలీసులు బాధితులను సురక్షితంగా కాపాడి కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.