18 July, 2026 | 3:17 AM

భారత్ చేరిన కువైట్ మృతదేహాలు

15-06-2024 01:41 AM

ఎయిర్‌ఫోర్స్ విమానంలో కేరళకు తరలింపు

తిరువనంతపురం, జూన్ 14: కువైట్‌లో అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో శుక్రవారం భారత్‌కు తీసుకొచ్చారు. 45 మృతదేహాలతో ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కొచ్చి విమానాశ్రయానికి చేరుకొన్నది. కేంద్ర మంత్రి కీర్తివర్దన్‌సింగ్ కువైట్ నుంచి మృతదేహాలను స్వయంగా తీసుకొచ్చారు. మృతదేహాలు కొచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్కడికి చేరుకొని మృతులకు నివాళులు అర్పించారు.

మృతుల కుటుంబసభ్యులు కూడా పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకొని, తమ వారు విగత జీవులుగా రావటాన్ని చూసి గుండెలవిసేలా విలపించారు. గత బుధవారం కువైట్‌లోని మంగాఫ్‌లో వలస కార్మికులు నివసించే ఓ అపార్ట్‌మెంట్‌లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో 49 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. మృతుల్లో 45 మంది భారతీయులున్నారు. అత్యధికంగా కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్, యూపీకి చెందినవారు ముగ్గురు చొప్పున, ఒడిశాకు చెందినవారు ఇద్దరు, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, పశ్చమబెంగాల్, హర్యానా, జార్ఖండ్‌వాళ్లు ఒక్కొక్కరు ఉన్నారు. 

అదొక జైలు

కొంతకాలం కష్టపడితే కుటుంబాన్ని బాగా పోషించుకొనేంత డబ్బు సంపాదించుకోవచ్చన్న ఆశతో గల్ఫ్ దేశాలకు పోతున్న వలస కార్మికులను అక్కడి గుత్తేదారులు జంతువులకంటే హీనంగా చూస్తున్నారు. కువైట్‌లో అగ్నిప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో విస్తు గొలిపే విషయాలు బయటపడుతున్నాయి. కార్మికులకు అతి తక్కువ ఖర్చుతో బస ఏర్పాటుచేసేందుకు గుత్తేదార్లు జైళ్లకంటే దారుణంగా ఉండే అపార్ట్‌మెంట్లను ఎంచుకొన్నారు. రైలు బోగీలో కంపార్ట్‌మెంట్లలా ఒకరిపై ఒకరు పడుకొనేలా ఆ భవనంలో ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడే ప్రమాదకరంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచారు.

గదులను వేరుచేసేందుకు కనీసం గోడలు కూడా లేవు. కార్డ్‌బోర్డు అట్టలతో గదుల్లాగా మలిచారు. ఏడంతస్తుల భవనం మొత్తాన్ని చెత్త గోదాములా మార్చేశారని, అందుకే మంటలు వేగంగా వ్యాపించాయని బాధితులు వాపోయారు. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన కార్మికులంతా కేరళకు చెందిన కేజీ అబ్రహం కంపెనీలోనే పనిచేస్తున్నారు. వారిని దుర్బరమైన ప్రదేశాల్లో ఉంచింది ఆ కంపెనీయే. పైగా అబ్రహం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన మలయాళ చిత్రం ఆడుజీవితం సహ నిర్మాత కూడా. ఈ చిత్రంలో సౌదీ అరేబియాలో వలస కార్మికుల వెతలను చూపించటం విశేషం.