18 July, 2026 | 3:10 AM

అహంకారులను రాముడు శిక్షించాడు

15-06-2024 01:42 AM
  1. అందుకే బీజేపీకి 241 సీట్లే ఇచ్చాడు
  2. బీజేపీ అధిష్ఠానంపై ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ విమర్శలు

జైపూర్, జూన్ 14: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించకపోవటంతో ఆ పార్టీకి మొదటి నుంచీ వెన్నుదన్నుగా ఉన్న వర్గాల నుంచే బాణాల్లాంటి విమర్శలు ఎదురవుతున్నాయి. బీజేపీని ఎన్నడూ పల్లెత్తి మాట అనని దాని మాతృసంస్థ ఆరెస్సెస్ మాటల తూటాలు దూసుకొస్తున్నాయి. తాజాగా ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్‌కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం నిర్వహించిన రామ్థ్ అయోధ్య యాత్ర దర్శన్‌పూజా సమారోహ్ కార్యక్రమంలో ఇంద్రేశ్ మాట్లాడారు. ‘రాముడిపై భక్తి ఉన్న పార్టీకి (బీజేపీ) అహంకారం పెరిగిపోయింది.

అందుకే 241 వద్దే ఆపేశాడు (రాముడు). అది అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చు. కానీ, ఓట్లు, అధికారం ఇవ్వాల్సిన దేవుడు వారి అహంకారం వల్ల ఆపే శాడు. రాముడిపై నమ్మకం లేని వాళ్లకు అధికారం ఇవ్వలేదు. అందరూ కలిసినా (ఇండియా కూటమి) రెండోస్థానమే ఇచ్చాడు. దేవుడి న్యాయం నిజమైనది’ అని వ్యాఖ్యానించారు. ఇంద్రేశ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీంతో ఇంద్రేశ్‌కుమార్ శుక్రవారం మాట మార్చారు. రాముడు వెన్నంటి ఉండటం వల్లనే బీజేపీ తిరిగి అధికారంలోకి రాగలిగిందని అన్నారు.